– అన్నీ తెలిసి ఫైనల్‌కు ‘స్లో పిచ్’
– టాస్ నెగ్గిన జట్టుకే ఆ ఆనుకూలత
– ఐసీసీ 2023 ప్రపంచకప్
12 ఏండ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించే సువర్ణావకాశం చేజారింది. సొంతగడ్డపై ఓటమెరుగని జైత్రయాత్ర సాగించిన టీమ్ ఇండియా ఫైనల్ ముంగిట వరుసగా 10 మ్యాచుల్లో అప్రతిహాత విజయాలు సాధించింది. టైటిల్ పోరుకు ముందు వరుసగా ఆరు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన భీకర ఫామ్ బౌలింగ్ బృందానిది. తొలుత బ్యాటింగ్ చేస్తే 357, 326, 410, 397 భారీ స్కోర్లు చేసిన రికార్డు బ్యాటింగ్ లైనప్‌ది. అయినా, ఫైనల్లో ఆతిథ్య జట్టు ప్రతిభను భారత క్రికెట్ బోర్డు విశ్వసించలేదా? కీలక తుది సమరానికి ‘స్లో పిచ్’ను ఎందుకు సిద్ధం చేసింది?!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్స్‌కు ముందు పిచ్‌పై కాస్త చర్చ నడిచింది. ముంబయి వాంఖడేలో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ పిచ్‌ను బీసీసీఐ ఆఖరు నిమిషంలో మార్చివేసింది. కొత్త పిచ్‌పై కాకుండా, గ్రూప్ దశ మ్యాచులకు ఉపయోగించిన పిచ్‌ను ఎంపిక చేసింది. జీవం లేని పిచ్‌పై పరుగుల వరద పారింది. న్యూజిలాండ్ పేసర్లకు స్వింగ్ అనుకూలత తొలగించేందుకు ఈ పని చేసినట్టు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. విదేశీ గడ్డపై భారత పేసర్లు అసమాన ప్రదర్శనతో పైచేయి సాధిస్తుంటే.. మన పిచ్‌లను ఇంకా పేసర్లకు సహకారం దక్కకుండా రూపొందించే ఆలోచనలో బోర్డు ఉంది. టీమ్ ఇండియా బౌలింగ్ బలం, పేసర్ల సత్తాపై బోర్డుకు అవగాహన లేదా?!. ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ (సెమీస్), నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లను టీమ్ ఇండియా ఆలౌట్ చేసింది. తొలుత బ్యాట్ పట్టినా, బంతి అందుకున్నా.. మన బౌలర్ల లక్ష్యం ఒక్కటే. ప్రత్యర్థి జట్టును వీలైనంత తక్కువ స్కోరుకు కుప్పకూల్చటమే. ఆ పని చేయటంలో బుమ్రా దళం విజయవంతమైంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో ఇంగ్లాండ్‌తో మాత్రమే 229 పరుగులు చేసింది. లక్నోలో ఆడిన ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు మాయ చేశారు. ఇంగ్లాండ్‌ను మనోళ్లు 129 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇతర మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి 357, 326, 310, 397.. ఇలా భారీ స్కోర్లు సాధించారు.
స్లో పిచ్ ఓ లక్కీ లాటరీ
భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు సైతం వాడిన పిచ్‌నే సిద్ధం చేశారు. భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశ మ్యాచ్‌కు వినియోగించిన పిచ్‌ను మళ్లీ తుది పోరుకు వాడారు. జట్టు మేనేజ్‌మెంట్ అడిగిందా? బీసీసీఐ పెద్దలు సూచించారా? అనేది తెలియదు. కానీ ఫైనల్‌కు మాత్రం ‘ స్లో పిచ్’ వాడారు. అందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఎందుకంటే స్లో పిచ్ లక్కీ లాటరీ వంటిది. ఈ పిచ్‌పై అదృష్టంతో పాటు టాస్ సైతం కలిసి రావాలి. పగటి వేళ పిచ్‌పై పగుళ్లు తేలి స్పిన్, స్వింగ్‌కు కాస్త అనుకూలిస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పరుగులు చేయటం అంత సులువు కాదు. స్లో పిచ్‌పై బంతి పడిన తర్వాత వేగం అమాంతం తగ్గిపోతుంది. బౌన్స్, స్వింగ్, సీమ్ ఏమీ ఉండవు. టెక్నిక్, టైమింగ్‌తో పరుగులు సాధించే బ్యాటర్లకు బంతి వేగం నెమ్మదించటంతో ‘కనెక్ట్’ కాలేరు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఇందుకు నిదర్శనం. స్లో పిచ్‌కు అదనంగా ఆసీస్ ఫీల్డింగ్ వ్యూహం కలిసొచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కనిపించింది. మంచు కారణంగా బంతి మెత్తబడింది. ఆరంభంలో పది ఓవర్లలో పేసర్లకు లభించిన ‘గ్రిప్’ ఆ తర్వాత స్పిన్నర్లకు లభించలేదు. దీంతో ట్రావిశ్ హెడ్, లబుషేన్ అలవోకగా పరుగులు సాధించారు. సాధించాల్సిన రన్‌రేట్ అందుబాటులో ఉండటంతో రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఆస్ట్రేలి యాకు ఏర్పడలేదు. దీంతో ఆస్ట్రేలియా ఫైనల్లో విజయం సాధించటం సులువైంది. శ్రీలంక, దక్షిణా ఫ్రికా, ఇంగ్లాండ్‌లను స్వల్ప స్కోరుకు కుప్పకూల్చిన మన బౌలర్లు.. ప్రతికూల పరిస్థితుల్లో ఆసీస్ మెడలు వంచలేకపోయారు. అందులో ప్రధాన కారణం రెండు. ఒకటి స్లో పిచ్, రెండోది మంచు. స్లో పిచ్ రూపకర్త బీసీసీఐ. అహ్మదాబాద్ వైఫల్యం ప్రధాన బాధ్యత బోర్డుదే!.
అయినా.. మన జట్టు గొప్పే!
2023 ప్రపంచకప్ విజయం చేజారినా టీమ్ ఇండియాను ఏమాత్రం తక్కువ చేయలేం. ప్రపంచకప్‌ను ఎవరు నెగ్గుతారో తేల్చేందుకే ఐసీసీ టోర్నీలు కానీ.. ప్రపంచ అత్యుత్తమ జట్టు ఎవరనే అంశం తేల్చేందుకు కాదు. ప్రపంచకప్‌లో పోటీపడిన అన్ని జట్లను ఓడించిన టీమ్ ఇండియా రియల్ విన్నర్‌గా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో ప్రతి జట్టు స్వప్నించే ప్రదర్శన రోహిత్‌సేన గ్రూప్ దశలో సాగించింది. బంతితో, బ్యాట్‌తో, ఫీల్డ్‌లో టీమ్ ఇండియా అసమాన జట్టుగా నిలిచింది. లోప రహిత జట్టుగా ఓ ఐసీసీ టోర్నీలో ఫైనల్ వరకు చేరిన జట్టు టీమ్ ఇండియా ఒక్కటే. 2023 ప్రపంచకప్ వేటను చెపాక్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో మొదలెట్టిన టీమ్ ఇండియా.. అహ్మదాబాద్‌లో అదే ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ముగించటం గమనార్హం.