– భద్రతా చర్యలు పాటించండి : సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వినాయక చవితి పండుగ సందర్భముగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి హెచ్చరించారు. నిర్వాహకులు నాణ్యమైన, ఐఎస్‌ఐ మార్కు కలిగిన వైర్లను వినియోగించాలని సూచించారు. శనివారంనాడాయన గణేష్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే గణేష్ పండుగ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారనీ, మండపాలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదనీ, సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని చెప్పారు. తగినంత కెపాసిటీ కలిగిన ఎమ్‌సీబీలను తప్పనిసరిగా వాడితే, విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ వినియోగదారులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.