మహిళలపై నేర విచారణలో వాస్తవికంగా వ్యవహరించండి

– సుప్రీం సూచన
న్యూఢిల్లీ : మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులను విచారించే సమయంలో వాస్తవిక పద్ధతిలో వ్యవహరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సూచించింది. సాంకేతిక పద్ధతులను, అంశాలను కారణంగా చూపి లేదా పనికిమాలిన విచారణ లేదా సాక్ష్యాధారాల్లో గణనీయమైన లొసుగులతో నేరస్తులు తప్పించుకోవడానికి అనుమతించవద్దని కోరింది. విష ప్రయోగం వల్ల భార్య మరణించిన కేసులో దోషిగా తనను నిర్ధారించడంపై ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ జస్టిస్‌ జె.బి.పరిద్వాలా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.
తన భార్య అస్వస్థతతో పడిపోగానే తాను ఢిల్లీలోని సంజరు గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లానని ఆ భర్త చెబుతున్నాడని, కానీ అందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యా ధారాలు లేవని బెంచ్‌ పేర్కొంది. క్రిమినల్‌ కేసుల్లో సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 106ని అత్యం త జాగ్రత్తగా కోర్టు వర్తింపు జేయాలని బెంచ్‌ పేర్కొంది.
ఇందుకు సంబంధించి అనేక కేసులను బెంచ్‌ ఉదహరిం చింది. ఇక్కడ కేసులో ఆస్పత్రిలో ఏం జరిగిందనేది ఆ వ్యక్తి చెప్పడం లేదని, పూర్తిగా మౌనం పాటిస్తున్నాడని బెంచ్‌ పేర్కొంది. ఒకవేళ తన భార్యను ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే ఆమె మరణించి వుంటే ఎలాంటి న్యాయపరమైన పద్ధతులు పాటించకుండా ఆస్పత్రి అధికారులు అలా మృతదేహాన్ని వెనక్కి పంపించివేస్తారని ఊహించడమే కష్టంగా వుందని బెంచ్‌ వ్యాఖ్యానించింది.