– అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
– వర్షాలపై ఆరా తీసినట్టు సీఎమ్‌ఓ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. భారీ వర్షాలు, రక్షణ, పునరావాసం, సహాయకచర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై శుక్రవారంనాడాయన ఆరా తీశారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. వర్షం ముప్పు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు వైద్యం, వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని చెప్పారు. వరద ముంపు తగ్గి కుదుట పడుతున్న ప్రాంతాల్లో అంటు వ్యాధుల నిరోధానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్ ద్వారా అందించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తెగిన చెరువులు, రహదారులు, బ్రిడ్జీలను పరిశీలించారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఖమ్మం జిల్లా మున్నేరు వాగు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో పరిస్థితులపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కెే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.