– సీఎస్ శాంతికుమారి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వేసవి నేపథ్యంలో వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీరాజ్ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సీజీఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలనీ, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందనీ, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని సీఎస్‌కు వివరించారు. తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కత్రిమ కొరత సష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామనీ, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని సీఎస్‌కు చెప్పారు. .
ప్రతి మున్సిపాల్టీలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామనీ, నీటి సరఫరాలో చిన్న అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిషోర్, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీ బీ సుదర్శన్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.