బేర్‌ పంజా

బేర్‌ పంజా– రూ.21 లక్షల కోట్లు ఆవిరి
– మూడు సెషన్లలో దలాల్‌ స్ట్రీట్‌ ఇన్వెస్టర్లకు నష్టం
– సెన్సెక్స్‌ మరో 906 పాయింట్ల పతనం
– అదానీ షేర్లకు గడ్డుకాలం
– ఎన్నికల బాండ్ల దెబ్బకు విలవిల..!
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలు తున్నాయి. బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ భారీ పతనాన్ని చవి చూసింది. అమ్మకాల ఒత్తిడితో 906 పాయింట్లు లేదా 1.23 శాతం క్షీణించి.. 72,762కు దిగజారింది. ఇంట్రాడేలో 1300 పాయింట్లు మేర పతనమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 338 పాయింట్లు లేదా 1.5 శాతం కోల్పోయి 21,998 వద్ద ముగి సింది. ఒక్క పూటలోనే రూ.14 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. ఉదయం లాభాల్లో ప్రారంభ మైన సూచీలు.. 11 గంటల తర్వాత ఒక్క సారిగా నష్టాల వైపు జారుకున్నాయి. ఆ తర్వాత ఏ స్థాయి లోనూ కోలుకోలేకపోయాయి. గడిచిన మూడు సెషన్లలో బీఎస్‌ఈ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ. 20.69 లక్షల కోట్లు హరించుకుపోయి.. రూ.372 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అంటే దాదాపు రూ.21 లక్షల కోట్లు మదుపర్లు నష్టపోయారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందే నని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటి నుంచి దలాల్‌ స్ట్రీట్‌లో సెగలు మొదలయ్యాయి. ఏఏ కార్పొరేట్‌ కంపెనీలు ఏ ప్రధాన పార్టీకి కొమ్ముగాశాయనే వివరాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా అమ్మకాలకు దిగుతున్నారు. కాగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం బీజేపీ వర్గాలను తీవ్ర ఆందోళ నకు గురి చేస్తోన్నాయని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అదానీ షేర్లు భారీ పతనాన్ని చవి చూస్తున్నాయి. పేటీఎం, అదానీ పవర్‌ సహా 1,010 స్టాక్స్‌ లోహర సర్క్యూట్‌ను తాకడం గమనార్హం. బుధవారం సెషన్‌లో బీఎస్‌ఈలో 290 షేర్లు మాత్రమే రాణించగా.. 3,202 స్టాక్స్‌ పతనాన్ని చవి చూశాయి. మరో 38 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఏకంగా 6.81 శాతం క్షీణించి రూ.2,909.80కి దిగజారింది. గడిచిన ఐదు సెషన్లలో ఈ సూచీ 11.52 శాతం నష్టాన్ని చవి చూసింది. ఒక్క పూటలోనే అదాని గ్రీన్‌ ఎనర్జీ సూచీ 8.33 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 9.14 శాతం, అదానీ పవర్‌ 5 శాతం, అదానీ పోర్ట్స్‌ 6.47 శాతం చొప్పున పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 30లో ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్ల్టే ఇండియా ఇండియా షేర్లు లాభపడ్డాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టాలను చవి చూశాయి. అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి. రియాల్టీ, మీడియా, పిఎస్‌యు బ్యాంక్‌, టెలికాం, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్స్‌ రంగాలు 4-6 శాతం పతనమయ్యాయి. సెబీ చీఫ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు 5 శాతం, 4 శాతం చొప్పున పడిపోయాయి. మార్కెట్ల వరుస పతనం నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.