పాత టైర్లతో అందంగా

ఈ స్పీడు యుగంలో ప్రతి ఇంట్లోనూ టూ వీలలో, ఫోర్‌ వీలరో ఏదో ఒకటి ఉంటున్నది. ఇంటికి ఒక బండి కాదు మూడు నాలుగు బండ్లు ఉంటున్నాయి. రవాణా సౌలభ్యం కోసం ప్రతి మనిషికి ఒక వాహనం అవసరమవుతున్నది. పిల్లలు కాలేజీలకు పెద్దలు ఆఫీసులకు దూర దూరాలు ప్రయాణించడానికి బండ్లు తప్పనిసరి అవుతున్నాయి. అయితే దీనికీ మన ఆర్ట్‌కూ సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ప్రతి బండికీ టైర్లుంటాయి కదా! ఆ టైర్లు అరిగిపోతే తీసేసి మళ్ళీ కొత్త టైర్లు వేయించుకుంటాం కదా! కొత్త టైర్లు వేయించుకుని పాత టైర్లు పారేస్తాం కదా! ఇక నుంచీ పాత టైర్లు పారేయకుండా కొన్ని కళారూపాలు సృష్టించువచ్చు. కళారూపాలు, వినియోగించుకునే వస్తువులను తయారు చేసుకుందాం. టైర్లతో తయారయ్యే కొన్ని కళాకృతుల్ని మీకు నేర్పిస్తాను. మొదటగా మా ఇంట్లో కొనుక్కున్న బజాజ్‌ చేతక్‌, మారుతి 800ల టైర్లను గుర్తు కోసం కళాకృతులుగా మలిచాను. మీరూ మీ జ్ఞాపకాలను పదిలపరుచుకోండి.

టీపారు
ప్రతి ఇంట్లో పంక్చరైపోయినవో, పాడై పోయినవో టైర్లుంటాయి. కాబట్టి వాటితో ఉపయోగపడే వస్తువులు చేసుకుంటే బాగుంటుంది. వీటితో అందమైన టీపారులు, కుర్చీలు ఎన్నో తయారు చేసుకుంటున్నారు. అయితే కొద్దిగా కార్పెంటర్‌తో పని ఉంటుంది. టైర్‌ను బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుని నలుపు రంగు వేసుకొని పెట్టుకోవాలి. టైరుకు పైనొక చెక్క, కిందొక చెక్క వేసి మేకులు కొట్టాలి. కింది చెక్కకు నాలుగు కాళ్ళు పెట్టాలి. దీనికే కొద్దిగా కార్పెంటర్‌ సహాయం తీసుకోవాలి. ఒకవేళ కాళ్ళు పెట్టకపోయినా బాగానే ఉంటుంది. పిల్లలు కూర్చోవడానికి ముచ్చటగా ఉంటుంది. పిల్లలు కింద కూర్చుని టైర్‌ టీపారు మీద ప్లేట్లు పెట్టుకొని తినడానికీ లేదా పుస్తకాలు పెట్టుకొని హౌం వర్కులు చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే టైరును శుభ్రం చేశాక మధ్యలో ఖాళీని పాత బట్టల దిండుతో నింపితే బాగుంటుంది. పాత బట్టల్ని దిండుగా కుట్టి టైరు మధ్య భాగంలో ఇమిడేలా సెట్‌ చెయ్యాలి. టైర్‌ టీపారుతో పాటు టైరు కుర్చీలు, టైర్‌ సోఫాలు కూడా చేసుకోవచ్చు.

పూల కుండీలు
టైర్లను పూల కుండీలుగా కూడా మార్చవచ్చు. దీంతో మన గార్డెన్‌ అందం పెరుగుతుంది. కొన్ని టైర్లను సేకరించి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కో టైర్‌కు ఒక్కో రంగు వేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక వాటికి కళ్ళు, ముక్కు, చెవులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నాక ఈ టైర్లను తీసుకువెళ్ళి గార్డెన్‌లో వరసగా పెట్టాము. ఎలా అలంకరించుకోవాలన్నది మీ ఇష్టం. మట్టిలో వరసగా టైర్లను పెట్టి ఆ టైర్లలో మట్టిని నింపాలి. ఇప్పుడు ఈ మట్టిలో మొక్కల్ని పెంచుకుంటే బాగుంటుంది. కుండీలలో పెంచుకుంటే ఎలా అందంగా కనిపిస్తాయో, ఈ టైర్ల కుండీలలో మొక్కలు పెంచుకున్నా చాలా అందంగా కనిపిస్తాయి. ఈ టైర్లు మొదట్లో తోలు బ్యాండ్లుగా ఉండేవి. ఈ తర్వాత ఇవి ఇనుప బ్యాండ్లుగా మారాయి. వ్యాగన్లు, రైలు వంటి వాటి చక్రాలు ఇనుప బ్యాండ్లుగానే ఉంటాయి. వాహనం మొక్క బరువును చక్రం ద్వారా భూమికి బదిలీ చేయడానికి టైరు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చక్రం ప్రయాణించే రోడ్డు ఉపరితలంపై వత్తిడిని నివారించడానికి కూడా టైరు అవసరం. ఆధునిక టైర్లు సింధటిక్‌ రబ్బరు, సహజ రబ్బరు, వైర్‌, కార్బన్‌ బ్లాక్‌ వంటి రసాయనిక సమ్మేళనాలతో తయారవుతున్నాయి.


క్యాటర్‌ పిల్లర్‌

చెట్లు పెట్టుకున్న గార్డెన్‌లో ఒక క్యాటర్‌ పిల్లర్‌ను చేసుకోవచ్చు. దీనికి చాలా టైర్లు కావాలి. కాబట్టి మన ఇంట్లో అన్ని టైర్లుండవు కదా! మెకానిక్‌ షాపులో ఉండే పాడైపోయిన టైర్లను సేకరించవచ్చును. తెచ్చుకున్న టైర్లన్నిటికీ రంగులు వేసుకోవాలి. రకరకాల రంగులు వేసుకుంటే బాగుంటుంది. బాగా ఎండిపోయాక టైర్లను వరసగా మట్టిలోకి గుచ్చాలి. ఈ టైర్లకు ముందు వైపున ముఖాన్ని, వెనకవైపున తోకనూ పెట్టుకోవాలి. దీనికి గాను చెక్కను గానీ అట్టను గానీ వాడాలి. అట్టను కత్తిరించి రంగులు వేసుకోవాలి. ఆ తర్వాత కళ్ళు, ముక్కు పెట్టి అలంకరించుకోవాలి. క్యాటర్‌ పిల్లర్‌ వలె చక్కగా అమిరి గార్డెన్‌కు అందాన్నిస్తుంది. ఇలా తయారు చేసిన వాటిని ఈ మధ్య రీసైక్లింగ్‌ మ్యూజియంలుగా రూపొందిస్తున్నారు. నట్లు, బోల్టులు, సైకిల్‌ చైనులు వంటి మెకానిక్‌ షాపులో పారేసే వాటితో జంతువుల్ని చేస్తున్నారు.

 

 

 

టైర్‌తో షోకేస్‌లా చేద్దాం
ఒక టైరును బాగా శుభ్రం చేసి నలుపు రంగును వేసుకుందాం. బాగా నల్లగా నిగనిగలాడేలా తయారు చేద్దాం. ఈ టైరుకు మధ్యలో మూడు నాలుగు చెక్కల్ని లేదా అద్దాలను అడ్డంగా ఫిక్స్‌ చేసుకోవాలి. అంటే ఇది బొమ్మలు పెట్టుకునే షోకేస్‌లా ఉపయోగపడుతుందన్నమాట. అడ్డంగా పెట్టిన అద్దాలపై బొమ్మలు పెట్టుకోవచ్చు. ఈ టైర్‌ మొత్తాన్ని గోడకు తగిలించుకోవాలి.

 


ద్విచక్ర వాహనం

ఇది నిజమైన ద్విచక్ర వాహనం కాదు. ఆ ఆకారంలో ఉండే పూలకుండీ. దీనికి రెండు టైర్లు ఉంటే చాలు. ఒక ప్లాస్టిక్‌ టబ్‌ కూడా అవసరం. ఇళ్ళలో గిన్నెలు కడిగి పెట్టుకోవడానికి, పిల్లల్ని స్నానం చేయించటానికి వాడే టబ్బులు ఉంటాయి. వీటికి ఏమైనా పగుళ్ళు వచ్చినా, చిల్లులు పడ్డా పారవేయకుండా పక్కనుంచుకుంటే ఇలాంటి వస్తువులను రూపొందించవచ్చు. ఫొటోలో చూపిన విధంగా రెండు టైర్ల మధ్యలో ఈ ప్లాస్టిక్‌ టబ్బును పెట్టాలి. ఇది నిలబడి ఉండేలా కింది భాగాన ఇనుప కడ్డీలు అమర్చాలి. పాడైపోయిన సైకిల్‌ సీటు, హ్యాండిల్‌ను తీసుకు వచ్చి ముందు, వెనక భాగాలలో అమర్చాలి. టైర్లకు అందంగా రంగులు వేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ టబ్బులో మట్టి పోసి మొక్కలు నాటుకోవాలి. రెండు టైర్ల లోపల కింది భాగంలో మట్టిపోసి మొక్కలు నాటవచ్చు. ఇలా టైర్లతో రకరకాల వస్తువులు చేసుకోవచ్చు.