తన 70వ దశకంలో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇది ఆమె జీవితంలో ఓ చిన్న భాగం మాత్రమే. ఆమె గురించి చెప్పుకునేందుకు ఇంకా ఎంతో ఉంది. అదే ది మ్యాక్స్ ఫౌండేషన్. దీని ఆధ్వరంలో గత 30 ఏండ్ల నుండి క్యాన్సర్ రోగులకు అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆమే విజి వెంకటేష్. జీవితం చివరి దశలోనూ సమాజానికి అంకితమై పని చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
71 ఏండ్ల వయసులో విజి వెంకటేష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని క్యాన్సర్ కేర్ కమ్యూనిటీకి మూలస్తంభంగా ఉన్నారు. ఉమ్మచి అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆమె ఇటీవలే అఖిల్ సత్యన్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్‌తో కలిసి ‘పచ్చుం అల్బుతావిలక్కుమ్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఆమె జీవితంలో దీనికంటే ఇంకా ఎంతో ఉంది. ది మ్యాక్స్ ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు దక్షిణాసియాకు ఆ సంస్థ రీజియన్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు నాణ్యమైన మందులు అందించే లక్ష్యంతో ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు.
క్యాన్సర్ సంరక్షణ వైపు
2002 నుండి ఆమె ది మాక్స్ ఫౌండేషన్‌లో పని చేస్తున్నారు. గ్లివెక్ ఇంటర్నేషనల్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాం నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక నోవార్టిస్ ఆంకాలజీ యాక్సెస్ (ఎన్‌ఓఏ) ప్రోగ్రామ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఆ రోగాన్ని అనుభవించాల్సిన అవసరం లేదంటున్నారు ఆమె. ‘అలా చేయడానికి నన్ను ప్రేరేపించిందేమిటి అని చాలా మంది అడుగుతుంటారు. నాకు క్యాన్సర్ లేదు. క్యాన్సర్ రోగుల కోసం నిధుల సేకరణకు అంకితమైన సంసఓ్థకు సహకరించాలని అనుకున్నాను. ముంబైలోని వ్యాపారులు, సంస్థల నుండి మద్దతు పొందడం ద్వారా నిధులను సేకరించడం ప్రారంభించాను’ అని వివరించారు.
కార్మికుల్లో అవగాహన
ముంబైలో ఎక్కువ మంది ఫ్యాక్టరీకార్మికులు క్యాన్సర్‌కు కారణమైన పొగాకుకు అలవాటు పడ్డారని విజి గుర్తించారు. ‘నా పని ప్రారంభ రోజుల్లో నేను సమీపంలోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్‌పై దొరికిన అన్ని పుస్తకాలను తీసుకున్నాను. వాటిని అధ్యయనం చేసాను. యూనియన్ నాయకులతో మాట్లాడటానికి కర్మాగారంలోని సంక్షేమ అధికారిని ఒప్పించే ప్రయత్నం చేసాను. అలా వారితో మాట్లాడి పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించగలిగాను. భారతదేశంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అత్యంత సాధారణం. ఈ మూడింటిని చాలా త్వరగా గుర్తించవచ్చు’ అని ఆమె వివరించారు. ఆమె బందం బ్యాంకులు, కార్పొరేట్ కార్యాలయాలను సందర్శించారు. వైద్యులు తమ ఖాళీ సమయాన్ని క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే శిబిరాలను నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
లుకేమియా బాధితుల కోసం
‘టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ప్రివెంటివ్ ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడానికి నన్ను నియమించారు. మూడేండ్లలో క్యాన్సర్ గురించి ప్రతిదీ నేర్చుకున్నాను. ఆ డాక్టర్లలో కొందరు ఇప్పుడు ఆసుపత్రుల డైరెక్టర్లుగా ఉన్నారు’ అని చెప్పారు. సీటెల్‌లో ప్రధాన కార్యాలయంగా ఉన్న ది మాక్స్ ఫౌండేషన్ 1997లో లుకేమియాతో బాధపడుతున్న పిల్లల కుటుంబాలకు విద్య, మద్దతు అందించేందుకు స్థాపించబడింది. 2001లో సంస్థ వెనుక బడిన 70 దేశాలలోని క్యాన్సర్ రోగులకుచికిత్సను అందించేందుకు, గ్లివెక్ ఇంటర్నేషనల్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను అభివద్ధి చేయడానికి ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఉమ్మచిగా జీవితం
మేకప్, లిప్‌స్టిక్, కాజల్, ముక్కు పుడుక, వెండి గాజులు… తన మొదటి సినిమా సెట్స్‌లో ఆమె ‘సిగేచర్ స్టైల్’కి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. తన సహజమైన రూపాన్ని చిత్రంలో చూపించారు. ఇందులో ఆమె పాత్ర ఓ స్వతంత్ర వద్ధ మహిళ. సామాజిక నిబంధనలను ధిక్కరించే మాతమూర్తి. సాధారణ చిత్రణలకు, సవాలు చేసే మూస పద్ధతులకు మించి ఉంటుంది. ఇదంతా ఒకరోజు అఖిల్ టీమ్ నుండి ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకి మెసేజ్ రావడంతో మొదలైంది. ‘నేను సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తాను. అఖిల్, అతని బందం ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోను చూశారు. ఓ ఫొటో ‘ఉమ్మచి’ పాత్ర సరిపోతుందని వారు భావించారు. నాకు కాల్ చేసి అడిగారు. నాకంత ఆసక్తి లేదు, పైగా మలయాళం కూడా పెద్దగా రాదు. ఈ వయసులో నటించడం ఏంటి అనుకున్నాను’ అంటూ ఆమె చెప్పారు.
టీమ్ సపోర్ట్‌తో…
తర్వాత విజి అఖిల్‌ని ముంబైలోని ఓ కేఫ్‌లో కలిశాడు. ‘అతను చాలా ఉద్వేగభరితమైన, శక్తివంతమైన యువకుడు. కథ, పాత్ర విన్నాక ఓకే చెప్పారు’ అని ఆమె వివరించారు. వెంటనే సినిమా బృందం ఆమెకు మలయాళం నేర్చుకునేందుకు సహాయం చేసింది. ఎలాంటి అనుభవం లేకపోయినా అదే నటించడం ఆమెకు సులభతరం చేసింది. ‘ఫహద్ ఫాసిల్‌తో సినిమా కోసం నా మొదటి సన్నివేశం చిత్రీకరిస్తున్న ప్పుడు డైలాగులు చెప్పలేక పోయాను. షూటింగ్ పూర్తయిన తర్వాత ఫహద్ నా దగ్గరకు వచ్చి ‘హారు, నేను ఫహద్..’ అన్నారు. దానికి నేను ‘నువ్వు ఫహద్ అని నాకు తెలుసు!’ అని చెప్పాను. ఇన్ని తప్పులు చేసినా చిత్రీకరణ టీమ్ అంతా తనకు సపోర్ట్‌గా ఉందని విజి పంచుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఆమె రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు జయరాజ్‌తో ఓ చిత్రానికి సైన్ చేశారు.
క్యాన్సర్ అవగాహన కోసం చాయ్
భారతదేశంలోని క్యాన్సర్ రోగులకు మద్దతు ఇచ్చే చాయ్ ఫర్ క్యాన్సర్ అనే అవగాహన, నిధుల సేకరణ ప్రచారానికి కూడా విజి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో భాగంగా చాయ్ అడ్డాల వద్దకు వెళుతున్నారు. దీని ద్వారా దాతలు, మద్దతుదారులను ఒకచోట చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ భయంకరమైన పరిస్థితి చుట్టూ సాధారణ స్థితిని సష్టించడానికి ఒక కప్పు చాయ్ ని ఉపయోగించు కుంటున్నారు. ఈ ప్రచారం ‘డ్రింక్ టు ఎ కాజ్’ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ‘నేడు కొత్త పురోగతులు, చికిత్సలు చాలా ఉన్నాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ రోగులకు అందుబాటులో లేవు. చాలా దేశాల్లో రోగులకు ప్రభుత్వం నుండి పెద్దగా మద్దతు లభించదు. అలాంటి వారికి నిధులు అందించాలి’ అంటూ ఆమె పంచుకున్నారు.
అన్నీ ఉన్నప్పటికీ…
‘క్యాన్సర్‌ని నయం చేయవచ్చు. అయితే దాని కోసం డబ్బు కావాలి. మన దగ్గర సాంకేతికత బాగానే ఉంది. కానీ క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా గుర్తించడం, దానికి సంబంధించిన అపోహలు, వివక్ష వంటి సమస్యలున్నాయి’ ఆమె జోడించారు. ఎవరైనా క్యాన్సర్‌తో మరణిస్తే ‘క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు’ అని చెబుతారని ఆమె నొక్కి చెబుతున్నారు. ఇది కరెక్టు కాదని ఆమె నమ్ముతున్నారు. ఆరు నెలల కిందట విజి క్యాన్సర్‌తో పోరాడిన భర్తను కోల్పోయారు. ‘అతను రోగ నిర్ధారణ తర్వాత ఐదు వారాల పాటు జీవించాడు. నాకు మంచి పలుకుబడి వుంది. అత్యుత్తమ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. ఆ సమయంలో నా భర్తకు కావలసినవన్నీ నేను చేయగలిగాను. కానీ అది సరిపోలేదు’ ఆమె చెప్పారు. ఏది ఏమైనప్పటికీ విజి వ్యాధికి వ్యతిరేకంగా పోరాడేందుకు అంకితమై ఉన్నారు. యువత గురించి ఆమె మాట్లాడుతూ ‘మీ మనసు చెప్పింది వినండి. మీరు ఏం చేయగలరో అది చేయండి. నిర్భయంగా ఉండండి. ప్రజలు మిమ్మల్ని మీరు చూసే విధంగానే చూస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టే శక్తి మీవద్దనే ఉంచుకోండి. అవకాశాలు వచ్చినప్పుడు బెదిరిపోకూడదు. వాటిని ఉపయోగించుకోండి’ అంటూ ముగించారు.
మలుపుతిప్పింది
విజి ఢిల్లీలోని ఓ సాధారణ కుటుంబంలో పెరిగారు. ఆంగ్లంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసి 1974లో వివాహం చేసుకున్నారు. తర్వాత ముంబైకి వెళ్లారు. అక్కడి వాతా వరణం ఢిల్లీకి పూర్తి భిన్నంగా ఉంది. ‘ముంబై నగరం నా ఆసక్తులను కొనసాగించడంతో పాటు కొంత స్వేచ్ఛను కూడా పొందాను. ఈ ప్రయాణంలో నా భర్త కూడా నాకు సహకరించారు. 80ల చివరలో ఆంగ్ల డిగ్రీతో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. అయితే క్యాన్సర్ రోగుల కోసం పనిచేయాలనే నా కోరిక నా మార్గాన్ని వేరే మలుపు తిప్పింది’ ఆమె చెప్పింది.