ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌

– ‘యువగళం’ దెబ్బకు వైసిపి ప్యాకప్‌ ఖాయం : లోకేష్‌
ఒంగోలు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రతి స్కీమ్‌ వెనుక స్కామ్‌ ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. యువగళం దెబ్బకు వైసిపి ప్యాకప్‌ చేయడం ఖాయమని అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 156వ రోజుకు చేరింది. ఆదివారం నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం వెంగళాపురం నుంచి ప్రారంభమైన యాత్ర వలేటివారిపాలెం వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి వలంటీర్లను పెట్టి ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారని, డేడా దొంగ జగన్‌ అని ఆరోపించారు. వ్యక్తిగత సమాచారం ఇస్తే మీకు ఉన్న ఆస్తులను కొట్టేయడం ఖాయమని విమర్శించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేస్తే, జగన్‌ కమీషన్లకు కక్కుర్తితో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి ప్రాజెక్టును ప్రమాదంలో పడేశాడని విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారేగానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. జగన్‌ ఇప్పటి వరకు విద్యుత్‌ ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచారని.. ఆర్‌టిసి ఛార్జీలు మూడుసార్లు పెంచారన్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. బిసిలకు, మైనార్టీలకు, దళితులకు టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చి అనే పథకాలను వైసిసి ప్రభుత్వం తొలడించిందని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కందురూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామని, పేపర్‌ పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కందుకూరును మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతామని, మామిడి, సపోట రైతులకు మార్కెటింగ్‌ అవకాశంపాటు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పొన్నలూరు మండలం మాలపాడు వద్ద జిల్లా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.