తోడు దొంగల’ పోస్టర్‌ ఆవిష్కరణలో ఉద్రిక్తత

–  అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
–  వాగ్వాదం.. తోపులాట
–  మధ్యలో నుంచే మాణిక్‌రావ్‌ థాక్రే వెనక్కి
–  ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌
హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద శనివారం సాయంత్రం ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ థాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మాధుయాష్కిగౌడ్‌ తలపెట్టిన తోడుదొంగలు పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ థాక్రే, మాధుయాష్కిగౌడ్‌ హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ వలీవుల్లా, ఇతర నాయకులతో కలిసి ‘తోడు దొంగలు’ పోస్టర్‌ను విడుదల చేసేందుకు బయల్దేరారు. అయితే వారిని చార్‌ కమాన్‌ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. చార్మినార్‌ వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతి లేదని చెప్పారు. కారులోంచి పోస్టర్‌ను తీసుస్తుండగా పోలీసులు లాక్కోవడంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీస్‌ జులూం నశించాలి అంటూ నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా పోస్టర్‌ ఆవిష్కరించి వెళ్లి పోతామన్నా పోలీసులు వినిపించుకోలేదు. మాణిక్‌రావ్‌ థాక్రేను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. మధుయాష్కి గౌడ్‌తోపాటు కె.వెంకటేష్‌, బోయ నగేష్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని.. తర్వాత వదిలేశారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, సగం ముఖం కేసీఆర్‌, సగ ముఖం నరేంద్రమోడీ చిత్రంతో అర్ధాకృతితో ‘తోడు దొంగల’ పేరుతో పోస్టర్‌ను రూపొందించారు.