– 21 వేల హార్ట్ సర్జరీలు చేసిన డాక్టర్ సయ్యద్ ఇమాముద్దీన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ ఇమాముద్దీన్ 2023కుగాను ఉత్తమ కార్డియాలజిస్ట్‌గా అవార్డునందుకున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం (టీఐఎఫ్) అధ్యక్షులు డాక్టర్ రాజ్‌నారాయణ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శినీ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. అత్యధిక సర్జరీలు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసినందుకుగాను ఈ అవార్డును అందించినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ ఇమాముద్దీన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.అశోక్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గార్గ్ తదితరులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అసాంక్రమిత వ్యాధుల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 30 శాతంపైగా గుండె సంబంధిత వ్యాధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో యువత కూడా గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారని తెలిపారు. మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లను చేసుకోవాలనీ, దైనందిన చర్యల్లో వ్యాయమం తప్పనిసరిగా చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అక్తర్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్లు, డాక్టర్లు కళాశాల ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు.