– 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు దృశ్యం
– పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ : 2019 నుంచి 2021 మధ్య కాలంలో దేశంలో 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. అదృశ్యమైన వారిలో మహిళలు (18 ఏళ్లకు పైబడినవారు) 10,61,648 మంది, బాలికలు (18 ఏళ్ల లోపువారు) 2,51,430 మంది ఉన్నారు. గతవారంలో పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో( ఎన్‌సిఆర్‌బి) రూపొందించింది. మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా 1,98,414 మంది, తరువాత స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్ నుంచి 1,93,511 మంది, మహారాష్ట్ర నుంచి 1,91,433 మంది అదృశ్యమయ్యారు. ఒడిశాలో 86,871 మంది అదృశ్యమయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 59,933 మంది అదృశ్యమయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విషయంలో ఢిల్లీలో 83,973 మంది అదృశ్యమయ్యారు. జమ్ముకాశ్మీర్ నుంచి 9,765 మంది అదృశ్యమయ్యారు. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన చట్టాలు, మహిళ భద్రతకు అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.