వర్షాకాలం… జాగ్రత్త

అధికారులకు రైల్వే జీఎం హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వర్షాకాలంలో రైళ్ల రాకపోకలు, ట్రాక్‌ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆరుణ్‌కుమార్‌జైన్‌ అధికారుల్ని హెచ్చరించారు. సోమవారంనాడిక్కడి రైల్‌నిలయంలో ఆయన జోన్‌ పరిధిలోని డివిజనల్‌ రైల్వే మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనల వద్ద పెట్రోలింగ్‌ను పటిష్టంచేయాలని ఆదేశించారు. ట్రాక్‌లపైకి వర్షపునీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైలు కార్యకలాపాలకు సంబంధించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. కచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.