శిష్యుడు : గురువుగారూ గురువుగారూ. భగత్ సింగ్ ఇంకా బతికే ఉన్నాడు.
గురువు : అవునవును. బుధవారంనాడు పార్లమెంటు భవనంలో పొగబాంబులు విసిరిన ఘటనలు భగత్ సింగ్ ఘటనలనే జ్ఞప్తికి తెస్తున్నాయి.
శి : ఒక్కసారిగా పార్లమెంటు లోపలే కాదు. పార్లమెంటు వెలుపల కూడా దేశం యావత్తూ ఉలికి పడింది. ఆ యువతకు ఎంత ధైర్యం?
గు : నిజమే, లోక్‌సభలో జీరో అవర్ నడుస్తుండగా ఇద్దరు యువకులు ఈ కలకలం సృష్టించారు. అదే సమయంలో సభ వెలుపల మరో ఇద్దరు యువకులు ఇదే పనికి పాల్పడ్డారు. భారీ భద్రతా వైఫల్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని మీడియా కోడై కూస్తున్నది.
శి : కూయదూమరి, కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్‌విస్టా ప్రధాని మోడీ నేతృత్వంలో పకడ్బందీగా నిర్మాణమై నడుస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలకు పోతుందిగా..
గు : శిష్యా నీ కెందుకంత అక్కసు?
శి : లేకపోతే ఏంటండి గురువుగారూ! ఉగ్రవాదులను నిర్మూలించడానికి సరిహద్దులు సైతం దాటుతామని ప్రగల్బాలు పలికేవారు మరి మన సొంత పార్లమెంటు భద్రత గురించి పట్టించుకోవద్దా? వారు నిజం బాంబులు వేయలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎందరి ప్రముఖుల ప్రాణాలు హరీ! అయిపోయేవో కదండీ.
గు : అందుకే నీకూ నాకూ భగత్‌సింగ్ గుర్తుకు వస్తున్నాడు. భగత్ సింగ్ కూడా అంతే. బ్రిటీష్ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలపై పెల్లుబుకుతున్న భారత ప్రజల ఆగ్రహజ్వాల ప్రపంచానికి తెలియాలంటే పార్లమెంటులో పొగబాంబు వేయడమే సరైన మార్గం అని భావించాడు. చెవిటివానికి శంఖం విన్పించేలా చేయడమే బాంబు లక్ష్యం తప్ప ప్రాణాలు హరించడం ఎంతమాత్రం కాదని విస్పష్టంగా ప్రకటించాడు భగత్‌సింగ్.
శి : నిజం చెప్పారు గురువుగారు ఇప్పుడు ఈ యువత కూడా అలానే అంటున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఈ ఆరుగురు భగత్ సింగ్ ఫ్యాన్ పేజీలో చేరారట. లలిత్ ఝా, సాగర్ శర్మ, మనో రంజన్ ఈ ముగ్గురు ఏడాది క్రితమే మైసూరులో సమావేశం అయ్యారట. ఇంకో ముగ్గురు నీలం, షిండే, అమూల్ మొత్తం ఆరుగురు. భిన్న ప్రాంతాలవారు. ఈ పథకాన్ని అమలుపరచారని వార్త లొచ్చాయి. ఎంత తెగింపండీ గురువుగారూ. వారికసలు ప్రాణభయం లేదనుకుంటా. పట్టుబడిన వారందరూ ఒకేలా సమాధానం చెబుతున్నారు. గత వర్షాకాల సమావేశాల్లోనే ఇందుకోసం రెక్కి కూడా నిర్వహించారట. చూసారా గురువుగారూ ఎంత పకడ్బందీ ప్లానో, సినిమాల్లో కూడా చూడలేదు.
గు : ఏమిటీ నీ ఉత్సాహం?
శి : తమపై భగత్‌సింగ్ ప్రభావం ఉన్నదనీ, మణిపూర్‌లో హింసాకాండ, దేశంలోని నిరుద్యోగం, రైతుల సమస్యలను ప్రజలకు తెలియడం కోసమే తామీ పనిచేసామని వారే స్వయంగా పోలీసులకు చెప్పారండీ. అంతేకాదు. ప్రభుత్వానికి ఓ సంకేతాన్ని పంపాలన్న లక్ష్యంతోనే ఈ సాహసానికి ఒడిగట్టామని కూడా తెలిపారట. పాపం ఇప్పుడీ ఆరుగురిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం – ఉపాతో సహా పలు సెక్షన్‌ల క్రింద కేసులు నమోదు చేసి నిర్భందించారు.
గు : ఒక ప్రక్క పార్లమెంటు భద్రత డొల్ల అంటున్నావు. మరో ప్రక్క ఈ యువతను వెనుకేసు కొస్తున్నావు.
శి : రెండూ నిజమే కదండీ గురువుగారూ.
గు : నిజమే, భగత్ సింగ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కేవలం సాహసం గురించి మాట్లాడుకుంటే సరిపోదు. ఆ విప్లవ వీరుడు అనుసరించిన సైద్ధాంతిక భూమిక గురించి కూడా తెలుసుకోవాలి.
శి : కాస్త వివరించండి.
గు : ‘విప్లవం ప్రపంచ నియమం, మానవాళి ప్రగతికి అది ఆధారం. అయితే అందుకు రక్తపాతం అనివార్యం కాదు. వ్యక్తిగత హింసకు అందులో చోటులేదు. ఆర్థికంగా రాజకీయంగా ఈ వ్యవస్థను మార్చుకోవాలనే ప్రజల మనోబలమే విప్లవానికి నిజమైన బలం. మనిషిని మనిషి దోచుకునే పద్ధతిని అంతం చేయడమే విప్లవ లక్ష్యం. విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్’ – ఇవి నా మాటలు కావు. సాక్షాత్తు భగత్‌సింగ్ పలికినవి. కేవలం 23 ఏళ్ళ చిరుప్రాయంలోనే ఈ విధంగా చెప్పగలిగాడు.
శి : అందుకే యువశక్తి కి నవశక్తికి సంకేతం భగత్ సింగ్.
గు : అంతేకాదు ‘దేశానికి ప్రజలకు సేవ చేయడంలో ఇతరులకు హాని కల్గించడం కంటే మా జీవితాన్ని మేమే అంతం చేసుకుంటాం. మేము సామ్రాజ్యవాదుల తొత్తు సైనికులం కాము. వారికి నిర్దయగా హత్యలు చేయడం నేర్పుతారు. మేం జీవితాన్ని ప్రేమిస్తాం గౌరవిస్తాం. దానిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాం. అనికూడా భగత్‌సింగ్ చెబుతాడు.
శి : ఎంతటి పరిణితి కలిగిన మాటలు గురువు గారు. అద్భుతం. అందుకే మన మదిలో జన హృదిలో కలకాలం నిలిచే ఉంటాడు. భగత్‌సింగ్ నిత్యం బతికే ఉంటాడు.
కె.శాంతారావు
9959745723