– అమ్మకానికి 81.5 కోట్ల మంది భారతీయుల సమాచారం
– ప్రమాదంలో ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్ష డేటా
– డార్క్‌వెబ్‌లో పౌరుల డేటాబేస్ ప్రచారం
న్యూఢిల్లీ : భారత్‌లో పౌరుల సమాచారానికి భద్రత కరువైంది. ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షల సమాచారం ప్రమాదంలో ఉన్నది. దాదాపు 81 కోట్ల మందికి పైగా భారతీయుల సమాచారం అమ్మకానికి ఉన్నట్టుగా తెలుస్తున్నది. కోవిడ్ సమయంలో పౌరుల దగ్గర నుంచి సేకరించిన వారి పేర్లు, ఫోన్‌నెంబర్లు, చిరునామా వంటివి ఇందులో ఉన్నట్టు సమాచారం. అయితే, ఐసీఎంఆర్ ఫిర్యాదు అనంతరం సీబీఐ ఈ విషయాన్ని విచారించే అవకాశం కనిపిస్తున్నది. దీంతో కోవిడ్-19 డేటా లీక్ అంశం ఇప్పుడు సర్వత్రా ఆందోళనను కలిగిస్తున్నది. కోవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్తున్న మోడీ సర్కారు.. ఈ డేటా లీక్ ఆరోపణలపై సమాధానం చెప్పాలని సామాజికవేత్తలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమాచారం ఇంకా ఎవరి చేతుల్లోకి వెళ్లిందో అనే విషయంపై లోతుగా దర్యాప్తు జరగాలని వారు అంటున్నారు. ఇందులో మోడీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. డార్క్ వెబ్‌లోని పౌరుల డేటాబేస్‌ను ప్రచారం జరిగింది. ఇందులో 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలతో పాటు ఆధార్, పాస్‌పోర్ట్ సమాచారం ఉన్నది. పౌరుల కోవిడ్-19 పరీక్ష వివరాల నుంచి సేకరించిన డేటా ఐసీఎంఆర్ నుంచి తీసుకోబడిందని ఇందులో పేర్కొనబడటం గమనార్హం.ఐసీఎంఆర్ ఫిబ్రవరి నుంచి అనేక సైబర్ దాడి ప్రయత్నాలను ఎదుర్కొంటున్నది. ఇటు కేంద్ర ఏజెన్సీలదీ అదే బాధ. ఐసీఎంఆర్ సర్వర్‌లను హ్యాక్ చేయడానికి గతేడాది 6,000కు పైగా ప్రయత్నాలు జరగటం గమనా ర్హం. ఏదైనా డేటా లీక్‌ను నివారించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలను ఐసీఎంఆర్ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీడబ్ల్యూఎన్0001 అనే మారుపేరుతో ఒక వ్యక్తి రుజువుగా నాలుగు పెద్ద లీక్ నమూనాలను కలిగి ఉన్న స్ప్రెడ్‌షీట్‌లను పంచుకోవటం గమనార్హం. ఈ విషయం యొక్క సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని వివిధ ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులందరూ రంగంలోకి దిగినట్టు సమాచారం. లీక్‌లో విదేశీ నటీనటులు ప్రమేయం ఉన్నందున దానిని ఒక ప్రీమియర్ ఏజెన్సీ ద్వారా విచారించడం చాలా ముఖ్యం అని సామాజికవేత్తలు, విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. భారతదేశ ఆరోగ్య వ్యవస్థను హ్యాకర్లు టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏయిమ్స్ సైబర్‌దాడిని ఎదుర్కొన్నది. ఇది వివిధ వ్యవస్థలలో మార్పులను ప్రేరేపించింది.