బిల్లులు రాక అప్పులు తీరక..!

Bills do not come, debts do not go away..!– ఏండ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు
– ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లు
– పలు చోట్ల నిలిచిపోయిన అభివృద్ధి పనులు
– నిధుల విడుదలపై దృష్టిసారించని ప్రభుత్వం
– తాజాగా మిషన్‌ భగీరథ గుత్తేదారుల నిరసన
వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక గోస పడుతున్నారు. పనులు పూర్తిచేసి నెలలు.. సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించి బిల్లులు విడుదల రావడం లేదు. ఫలితంగా అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టిన గుత్తేదారులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అప్పులకు వడ్డీలు పెరగడం.. కిందిస్థాయి సిబ్బందికి సైతం సకాలంలో జీతాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు. తాజాగా గ్రామాల్లో పనులు చేపట్టిన మిషన్‌ భగీరథ (ఇంట్రవర్క్స్‌) గుత్తేదారులు జడ్పీ కార్యాలయం ఎదుట బిల్లులు చెల్లించాలని ఆందోళన చేపట్టడం చర్చనీయాంశమైంది. రెండేండ్లుగా ఎదురుచూస్తున్నా నయాపైసా విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు శాఖల్లో పనులు చేపట్టిన వారి పరిస్థితి కూడా ఇదే మాదిరి ఉండటం గమనార్హం.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎంతో కొంత ప్రయోజనం కోసం పనులు దక్కించుకుంటున్న గుత్తేదారులు ఫలితం లేకపోగా అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది వరకు సర్పంచులు ఎదుర్కొన్న సమస్య మాదిరిగానే.. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాల్లో ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టిన చిన్న చిన్న గుత్తేదారుల పరిస్థితి దయనీయంగా మారింది. 2 నుంచి 3 శాతానికి వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టామని అంటున్నారు. 2021లో పూర్తి చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే సుమారు రూ.30కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
మిగతా శాఖలదీ ఇదే పరిస్థితి..!
మిషన్‌ భగీరథలో పనులు చేసిన కాంట్రాక్టుల మాదిరే.. మిగతా శాఖల్లోనూ కనిపిస్తోంది. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి సుమారు రూ.9.50కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. భూసేకరణ, ఎస్‌డీఎఫ్‌ నిధులు సుమారు రూ.40కోట్లు, డబుల్‌ బెడ్‌రూంలకు సంబంధించిన నిధులు మరో రూ.10కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోనూ కిందటి జూన్‌ నుంచి సుమారు రూ.6కోట్ల వరకు బిల్లులు రావాలని ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు మన ఊరు- మన బడి పనులకు సంబంధించి మరమ్మతులు, విద్యుద్ధీకరణ తదితర పనులకు సంబంధించి రూ.4.26కోట్లు, ఉపాధి హామీ నిధుల ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి మరో రూ.3కోట్ల వరకు గత మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలోనూ పట్టణ ప్రగతి, ఎస్‌డీఎఫ్‌, సీఎం అష్యూరెన్స్‌కు సంబంధించి సుమారు రూ.20కోట్ల వరకు బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇలా పలు శాఖలకు బిల్లులు సకాలంలో రాకపోవడం మూలంగా వాటి పరిధిలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి.
మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
మిషన్‌ భగీరథ కింద గ్రామాల్లో ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టాం. అదనపు పనులకు సంబంధించి మూడేండ్ల నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా.. మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి పనులు చేపట్టాం. బిల్లులు రాకపోవడం మూలంగా వడ్డీల మీద వడ్డీలు కడుతూ మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రభుత్వం స్పందించి త్వరగా బిల్లులు విడుదల చేయాలి.
కల్యాణ్‌, మిషన్‌ భగీరథ గుత్తేదారు