త్రిపురలో హింసపై విచారణకు వెళ్లిన నేతలపై బీజేపీ దాడి

– అతికష్టం మీద బయటపడ్డ పార్లమెంటరీ బృందం
– మూడు వాహనాలు ధ్వంసం
– గవర్నర్‌ను కలిసి వినతి
న్యూఢిల్లీ : త్రిపురలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) రాజ్యసభపక్షనేత ఎలమారం కరీం నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీల బృందంపై అధికార బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ ఎంపీలు సహా దాదాపు 30 మంది ప్రయాణిస్తున్న వాహనానికి నిప్పు పెట్టారు. రాళ్లు రువ్వారు. పోలీసులు చూస్తుండగానే మరో రెండు కార్లును ధ్వంసం చేశారు. ఎంపీలపైనా దాడికి పాల్పడ్డారు. ఈ హింసాకాండను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. త్రిపురలో మార్చి 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వామపక్ష, కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైన త్రిపురలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పది రోజుల్లోనే వెయ్యికి పైగా దాడులు జరిగాయి. వందలాది మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 700 ఇండ్లు కాలిపోయాయి. ధ్వంసమయ్యాయి. వామపక్ష, కాంగ్రెస్‌ మద్దతుదారుల రబ్బరు తోటలు, ఇతర వ్యవసాయ పంటలను బీజేపీ కార్యకర్తలు కాల్చివేశారు. వందలాది ఆవులు, గేదెలు, ఇతర పశువులు కాలి బూడిదయ్యాయి. సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, నేతల ఇండ్లలోకి చొరబడి, ధ్వంసం చేసినా, కాల్చివేసినా అక్కడి బీజేపీ ప్రభుత్వం ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు మౌనం దాల్చడంతో ఎంపీల బృందం నిజనిర్ధారణ కోసం రాష్ట్రానికి వెళ్లింది. ఈ బృందంలో సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, పిఆర్‌ నటరాజన్‌, ఎఎ రహీమ్‌, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, కాంగ్రెస్‌ ఎంపీలు రంజితా రంజన్‌, అబ్దుల్‌ ఖలీక్‌ ఉన్నారు. వారు మూడు బృందాలుగా సెపాహిజాల, గోమతి, పశ్చిమ త్రిపుర, ఖోవై, ధలై జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. పశ్చిమ త్రిపుర జిల్లా బిషాల్‌గఢ్‌లోని నేహాల్‌చంద్రానగర్‌ మార్కెట్‌లో ఎన్నికల ఫలితాలు తరువాత దాదాపు 20 షాపులను కాషాయమూకలు దహనం చేశాయి. ఆ ప్రాంతాన్ని సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీంతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ అబ్దుల్‌ ఖలీక్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేందర్‌ చౌదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అజోరు కుమార్‌, ప్రతాప్‌గఢ్‌ ఎమ్మెల్యే రాముదాస్‌, పీసీసీ అధ్యక్షుడు బ్రిజిత్‌ సిన్హా, ఇతర ఎమ్మెల్యేలు సందర్శించారు. నేతలను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణం సృష్టించిన బీజేపీ కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడ్డారు. మోహన్‌పూర్‌లో సందర్శనకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీలు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, ఎఎ రహీం, కాంగ్రెస్‌ ఎంపీ రంజితా రంజన్‌ బృందం ప్రయాణించే వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీగా ఉన్న పోలీసులు మౌనం దాల్చారు. దీంతో పోలీసుల వైఖరిపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌, సీపీఐ(ఎం) ఎంపీ పిఆర్‌ నటరాజన్‌, సీపీఐ ఎంపీ బినరు విశ్వంలతో కూడిన బృందం పశ్చిమ త్రిపురలోని బర్జాలా, బముతియా నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.
బాధితులకు ఎంపీల ఓదార్పు
బీజేపీ హింసాకాండలో దగ్ధమైన ఇండ్లు, వ్యాపారాల ప్రాంతాలను సందర్శించిన ప్రతిపక్ష ఎంపీల బృందం బాధితులను ఓదార్చింది. ఇన్నాళ్లూ కట్టుకున్న ఇండ్లు, ఇతర పొదుపు చేసుకున్న వనరులు కళ్లముందే బూడిదగా మారుతున్నాయని బాధితులు గుండెలవిసేలా ఆవేదనను పంచుకున్నారు. ఈ పర్యటన బాధితుల్లో విశ్వాసాన్ని నింపింది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ కూడా పాల్గొన్నారు.
గవర్నర్‌కు వినతి
అయితే దాడుల నేపథ్యంలో ఎంపీల బృందం శనివారం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. అనంతరం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను కలిసి వినతిపత్రం సమర్పించింది. సోనార్టరి స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బృందం సభ్యులు మాట్లాడారు. ప్రజల జీవితాలను, జీవనోపాధిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హింసాకాండతో ప్రతిపక్ష ఎంపీల బృందాన్ని తిప్పికొట్టగలమన్నది బీజేపీ భ్రమ మాత్రమేననీ, అది జరగదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్న త్రిపురలో బిజెపి గూండాయిజం కొనసాగుతోందని విమర్శించారు. త్రిపురలో జరిగిన హింసాకాండను పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు.
దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి: సిపిఎం
బిషాల్‌ఘర్‌లోని నేహాల్‌చంద్రానగర్‌లో ప్రతిపక్ష ఎంపీల బృందంపై జరిగిన దాడిని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి వర్గం ఖండించింది. దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. బీజేపీ పాలనలో రాష్ట్రానికి వచ్చే ఎంపీలకు కూడా భద్రత లేదని పేర్కొంది.
బీజేపీ పురిగొల్పింది
ఇది బీజేపీ పురిగొల్చిన హింస.
దాడిపై అక్కడ విజయోత్సవ ర్యాలీని బీజేపీ నిర్వహించటమే ఇందుకు నిదర్శనం. పార్లమెంటరీ బృందంపై దాడిని ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలి.
– జైరాం రమేష్‌

హేయమైన చర్య

నిజనిర్ధారణ బృందంపై సంఫ్‌ు దాడి హేయ మైంది. ఈ దుర్మా ర్గపు చర్య వెనుక సంఫ్‌ు పరివార్‌ ఉంది. అక్కడ శాంతిభద్రతలు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తున్నది. త్రిపురలో ఈ బీభత్స పాలనను ఓడించేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలి.
– పినరయి విజయన్‌

దాడి దారుణం

త్రిపురలో ఎంపీలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం దారుణం. అక్కడ బీజేపీ బీభత్స రాజకీయాలు కొనసాగుతున్నాయి. బాధితులతో మాట్లాడుతుండగా ఎంపీల వాహనాలు ధ్వంసమ య్యాయి. ఈ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నాం.
– సీతారాం ఏచూరి