సేద్యానికి కార్పొరేట్‌ ముప్పు

– అన్నదాత ఆగమే…
– దొడ్డిదారిన సాగు చట్టాల అమలుకు మోడీ కుతంత్రాలు
– అస్తవ్యస్తంగా మద్దతు ధరల నిర్ణయొంపత్తి కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం
– సహకార రంగంపై కార్పొరేట్ల కన్ను
– మోడీ సర్కారుతో పెరిగిన సాగు వ్యయం
పచ్చని పొలాలకు కార్పొరేట్‌ కంపెనీల ముప్పు పొంచి ఉంది. సేద్యాన్ని కార్పొరేట్లకు స్వాధీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు రైతులు అడ్డం తిరిగి వెనక్కి కొట్టినా, దొడ్డి దారిన వాటిని అమలు చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. రైతు పండించిన పంటలకు అస్తవ్యస్తమైన మద్దతు ధరలు నిర్ణయించింది. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని ఉట్టికెక్కించి, పెట్టిన పెట్టుబడి కూడా అందకుండా చేస్తోంది. ఫలితంగా రైతు అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతు న్నాడు. పత్తి కొనుగోలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తే, ధాన్యం కొనుగోలుకు ఎఫ్‌సీఐ తటపటాయిస్తుంటే, రైతులు మధ్యదళారీల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు.
గుడిగ రఘు
పత్తి రైతుల ఆత్మహత్యలు : పత్తికి మద్దతు ధర రూ. 6600 నిర్ణయించిన ప్పటికి… ఆ ధర అమలు కావడం లేదు. పత్తిని కొనాల్సిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పడకేసింది. తెలంగాణలో దాదాపు 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, సీసీఐ కొనకపోవడంతో రైతులు దళారులకు అడ్డికి పావుశేరు తీరున అమ్ముకోవాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా తిరిగిరాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
పెట్టుబడి ఎక్కువ…లాభం తక్కువ : సాధార ణంగా పత్తి సాగులో ఎకరాకు పెట్టుబడి రూ. 36,610 అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతున్న డీజిల్‌, పెట్రోల్‌, ఎరువులు, యంత్రాల ధరలతో రైతుపై మరో పదివేల అదనపు భారం పడుతోంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ళ పత్తి వస్తుంది. దీని ప్రకారం ఎకరాకు రూ. 60వేల ఆదాయం అనుకున్నా… పెట్టుబడ పోను రైతుకు మిగిలేది రూ. 14వేలు మాత్రమే. ఆరునెలలు కష్టపడితే నెలకు రూ. 2,333 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. రైతు కుటుంబం బతకడమే గగనంగా మారింది.
లెక్కలో లేని కౌలు రైతు : కౌలు రైతుల పేరిట కేంద్ర ప్రభుత్వం ముసా యిదా బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టింది. కార్పొరేట్ల ఒత్తిడిమేరకు ఆ ప్రక్రియను మధ్యలోనే ఆపేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చట్టాన్ని అమలు చేయకపోగా, వారిని గుర్తించడానికి కూడా ఇష్టపడటం లేదు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారికి ఎటువంటి రక్షణ సౌకర్యాలు లేవు. కనీసం ఆత్మహత్య చేసుకుంటే పరిహారం కూడా దక్కని దయనీయపరిస్థితి. ఆత్మహత్యల్లో కౌలు రైతులే ఎక్కువ.
సహకార సంఘాలకూ
బీజేపీ సర్కారు ఎసరు
రైతులకు చేదోడు, వాదోడుగా ఉంటున్న సహకార సంఘాలకు కూడా కేంద్రం ఎసరు పెట్టింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాల బిల్లు-2022 తెచ్చింది. ఆ గొడుకు కిందకు అన్ని సంఘాలను తీసుకొచ్చి లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్న సహకార సంఘాలను కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే 908 సహకార సంఘాలున్నాయి. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా ఉమ్మడి జాబితాలో ఉన్న వీటిని కేంద్రం తన గుప్పిట్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది.
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంపై ప్రచారహోరు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద రైతుకు ఏడాదికి రూ 6వేలు ఇస్తున్నది. దీనిపై ప్రచారం ఉన్నం తంగా ఆచరణ లేదు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటే, కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనలతో కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే ఇది అందు తోంది. అధార్‌కార్డు, రేషన్‌కార్డు, అకౌంట్‌ లింకుపేరిట సర్కారు సాకులు చెప్పడంతో 35 లక్షల మందికి అంద కుండా పోయింది.

Spread the love