– సీఎం అవినీతిపరుడంటూ చర్యలు తీసుకోరు?
– ఎంఐఎం అధినేతను నిఘా సంస్థలు ముట్టుకోవు :
– ప్రజా సంఘాల మ్యానిఫెస్టోల విడుదల సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. తెలంగాణ సమాఖ్య (సంఘాలు) ఆర్గనైజింగ్ కన్వీనర్ కరుణాకర్ దేశాయి అధ్యక్షతన శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ సమాఖ్య సంఘాల ఉమ్మడి మ్యానిఫెస్టో, ప్రజా సంఘాల మ్యానిఫెస్టోల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాలు పదే పదే సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎంలాగా మారిందని విమర్శలు చేస్తారే తప్ప…చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ మైనార్టీల భద్రత, సంక్షేమం కోసం ఉన్నానంటూ చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాల్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ ఓడిపోయే స్థానాల్లో కమలాన్ని గెలిపించేందుకు అక్కడికెళ్తుంటారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎంఐఎం పార్టీ పోటీ చేసిన వివిధ రాష్ట్రాల నియోజకవర్గాలను పూర్తిగా పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమైందని తెలిపారు. ఈ మూడు పార్టీలు బయటికి మాత్రమే విమర్శలు చేసుకుంటూ, లోపల లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఆ పార్టీకి సహకరిస్తున్న బీఆర్‌ఎస్, ఎంఐఎంలను కూడా ఓడించేందుకు ఓట్ల చీలిక జరగకుండా ప్రజాసంఘాలు ప్రయత్నించాలని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రత్యామ్నాయంగా నిలబడ్డ ప్రజాస్వామిక అభ్యర్థులను, వారూ లేని చోట కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ మనుష్యుల మధ్య విద్వేషాలు పెంచుతూ, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిందనీ, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్నదనీ, బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేసిన వారిని వదిలేసిందనీ, నల్లడబ్బు బయటికి వెలికి తీయలేదని విమర్శించారు. పొఫెసర్ కోదండరామ్ మాట్లా డుతూ పాలకులతో పాటు పాలనా విధానం కూడా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక దోపిడీతో ప్రభుత్వ ఆదాయం తగ్గిందన్నారు. విచ్చలవిడి జరిమానాలతో ప్రజలను చితకబాదుతున్నారని తెలిపారు. అప్పులు తెచ్చినా కాళేశ్వరం పూర్తి చేయలేదనీ, దక్షిణ తెలంగాణ పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని విమర్శించారు. ప్రజా సంఘాల కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డు కాదని స్పష్టం చేశారు. 40 రోజులు ప్రజల మధ్యకు ఐక్యంగా వెళ్లి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో జరిగిన నష్టాన్ని వివరించాలని సూచించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో ప్రజా సంఘాలు ప్రత్యామ్నాయ పాలన రావడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. ప్రధాని మోడీ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న ప్రత్యామ్నాయం రావడానికి ఇక్కడి ప్రజా సంఘాల అలాంటి క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమలంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమాఖ్య ఉమ్మడి మ్యానిఫెస్టో 28 ప్రజాసంఘాల మ్యానిఫెస్టోలను విడుదల చేశారు.