ప్రజా సమస్యలు విస్మరించిన బిజెపి ప్రభుత్వం

– కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముగాస్తున్న మోడీ
– మధిర గడ్డపై ఎర్రజెండా ఎగరాలి
– సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-ముదిగొండ
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి బడా పెట్టుబడిదారులకు సేవలందిస్తుందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు భాస్కర్‌ అన్నారు. సిపిఐ (ఎం) పమ్మి జోన్‌ కార్యకర్తల సమావేశం మండల నాయకులు పండ్రకోల రాంబాబు అధ్యక్షతన బాణాపురంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రజలను మరిచి, కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముగాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేశారని విమర్శించారు. మతతత్వ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మోడీ విధానాలను ఎర్రజెండాతో తిప్పికొట్టాలన్నారు. తొమ్మిదేళ్ల పాలల్లో మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బిజెపి విధానాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని గద్దెదించాలన్నారు. మధిర గడ్డపై ఎర్రజెండాను ఎగరవేసి విజయపతాకాన్ని అందుకోవాలన్నారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో నిర్మాణంతో పాటు, పార్టీ కార్యక్రమాలను విస్తృత పర్చాలన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను వెలికి తీసి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి వరప్రసాద్‌, బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, పమ్మి, పెద్దమండవ, కమలాపురం, బాణాపురం గ్రామ శాఖ కార్యదర్శులు చావా శ్రీనివాసరావు, మాదారపు శ్రీనివాసరావు, కె కుటుంబరావు, చింతకాయల రామారావు, నాయకులు వత్సవాయి సైదులు, టీఎస్‌ కళ్యాణ్‌, కందిమల్ల తిరుపతి, మాదారపు సత్యనారాయణ, బుగ్గవీటి పిచ్చయ్య, మరికంటి వెంకన్న, మందరపు వెంకన్న, మరికంటి నరసింహారావు, కొండమీద రఘుపతి తదితరులు పాల్గొన్నారు.