మరోసారి బీజేపీనయవంచన

– విభజన హామీలను నెరవేర్చాలి : కోలేటి దామోదర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన విభజన హామీల్లో దాదాపు అన్ని నెరవేర్చామంటూ చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మరోసారి నయవంచనకు పాల్పడిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హామీలను నిజంగా నెరవేర్చి ఉంటే పార్లమెంటు వేదికగా అంశాల వారీగా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, పారిశ్రామిక రాయితీలు తదితర హామీలను అమలు చేయకుండా మోడీ సర్కార్‌ తొమ్మిదన్నరేండ్లుగా రాష్ట్ర ప్రజలను మోసగిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజన హామీలను అమలు చేయాలని దామోదర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్‌ తన మేధాశక్తితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.