బీజేపీ తప్పుడు కథనాల సృష్టి

BJP is creating false narratives– పార్లమెంట్‌ పవిత్రతకు హాని కలిగించే ఒక్క మాట అనలే: బీఎస్పీ ఎంపీ దానిష్‌ అలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు పవిత్రతకు హాని కలిగించే ఒక్క మాట కూడా తాను మాట్లాడలేదని, కానీ బీజేపీ తనకు వ్యతిరేకంగా ”తప్పుడు కథనం”లను సృష్టించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తోందని బిఎస్పీ లోక్‌సభ ఎంపి దానిష్‌ అలీ అన్నారు. బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి తనపై లోక్‌సభలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న వివాదం నడుమ, బీఎస్పీకి చెందిన దానిష్‌ అలీ మంగళవారం స్పందించారు. గత గురువారం చంద్రయాన్‌-3 మిషన్‌ విజయంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా దానిష్‌ అలీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. దానిష్‌ అలీ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో 30 సెకన్ల వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరి వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ”ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్‌ పవిత్రతకు హాని కలి గించే ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు.
నా గురించి, నా కులం గురించి రమేష్‌ బిధూరి చేసిన దూషణలు, విపరీతమైన తీరులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు నేను పునరావృతం చేయదలుచుకోలేదు” అని పేర్కొన్నారు. అయినప్పటికీ బీజేపీ తప్పు డు కథనాలను సృష్టించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోందని అలీ విమర్శిం చారు. అధికార పార్టీ నాయకుడిపై చర్య తీసుకోవడంలో ”ఆలస్యం” గురించి ప్రశ్నించారు. ఆయన చుట్టూ కథనాన్ని నిర్మించడానికి బీజేపీ అగ్ర నాయకత్వం ఈ వ్యాఖ్యలను ఆమోదించినట్లుగా ఉందని ఆరోపించారు. సంఘటన జరిగిన ఆ రోజు నుంచి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు తవ్వి తీస్తున్నారని అలీ పేర్కొన్నారు.లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ దానిష్‌ అలీ ప్రవర్తనపై కూడా విచారణ జరిపించాలని పలువురు బీజేపీ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ బిర్లాకు డానిష్‌ అలీ లేఖ రాస్తూ, సభా వేదికపై బిధూరి దుర్భాషను ఉపయోగించిన అంశాన్ని ప్రివిలేజెస్‌ కమిటీకి సూచించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఖండించాయి. అలీకి మద్దతుగా నిలిచాయి. బీజేపీ ఎంపీ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ సభ్యులు బిర్లాకు లేఖ రాశారు. డానిష్‌ అలీని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌, సుభాషిణి అలీ కలిసి మద్దతు తెలిపారు.
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా కలిసి మద్దతు తెలిపారు. అయితే బిధూరిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ మీడియా విభాగం హెడ్‌ పవన్‌ ఖేరా మాట్లాడుతూ, ”ఏదైనా చర్య తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఏదైనా చర్య తీసుకున్నారా? వారిపై బీజేపీ నుంచి ఎందుకు చర్య తీసుకుంటారు?. సొంత ఎంపీ?” అని అన్నారు. ”మంత్రులపై అవినీతి ఆరోపణలు రుజువు కాకపోయినా.. వారిని తక్షణమే తొలగించడం ఈ దేశం చూసింది. ఇది మేము చూపించిన సున్నితత్వం, వారిపై ఎటువంటి రుజువు లేకుండా మా స్వంత పార్టీ నేతలను శిక్షించాము” అని ఖేరా అన్నారు. ”ఇదిగో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు రమేష్‌ బిధూరి….. మీకు ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ గుర్తున్నారా? మీకు సాధ్వి నిరంజన్‌ జ్యోతి గుర్తున్నారా? ఇలా బీజేపీ క్షమించిన నేరస్థుల జాబితాను నేను మీకు ఇవ్వగలను. ఆ స్థిరమైన ఇంటర్వ్యూలలో ఒకదానిలో ప్రధానమంత్రి ‘మై ఉన్‌కో మన్‌ సే మాఫ్‌ నహీ కరుంగా (నా హృదయం నుంచి వారిని క్షమించను) అని అన్నారు. ఇది తప్ప మరేమీ జరగదు” అని ఖేరా అన్నారు.