– ఇండియా పేరును ఎందుకు ద్వేషిస్తోంది?
– ఆ పేరంటేనే భయపడుతోంది
– ఇది చాలా విచిత్రం… రాజ్యాంగానికి అవమానం : ఏచూరి
నవ తెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం ‘అపరిపక్వం’గా ఉన్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. జీ-20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన విందు ఆహ్వాన పత్రికలో ఆమెను ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై ఏచూరి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడంతో బీజేపీ కలవరపడుతోందని చెప్పారు. ”ఇది చాలా విచిత్రం. మనకు రాజ్యాంగం ఉంది. శతాబ్దాలుగా దేశం ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు గడించిందో మనకు తెలుసు. స్వతంత్ర భారతదేశాన్ని మనం వారసత్వంగా పొందాము. రాజ్యాంగంలోని 1వ అధికరణలో ఇండియా… అంటే భారత్…రాష్ట్రాల సమాఖ్య అని స్పష్టంగా ఉంది’ అని అన్నారు. ”వైవిధ్యం, బహుళత్వం… ఇలా ప్రతి విషయాన్నీ రాజ్యాంగంలో చేర్చారు. మరి దీనిని బీజేపీ ఎందుకు మారుస్తోంది? ఇండియా పేరిట లౌకిక ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడడం బిజెపి నేతలకు ఇష్టం లేదా? అది వారి సమస్యా? ఇండియా అనే పదాన్ని బీజేపీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందో మాకు తెలియడం లేదు” అని ఏచూరి తెలిపారు. ఇస్రో, ఐఐటీ, ఐఐఎం సంస్థల పేర్లలో కూడా ఇండియా అనే పదం ఉన్నదని గుర్తు చేశారు. ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అనే దానిని ‘ప్రసిడెంట్ ఆఫ్ భారత్’ అని మార్చడం వెనుక ఉద్దేశమేమిటని నిలదీశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడం వల్లనే బీజేపీలో ఈ ఆలోచన వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇండియా అనే పదాన్ని వింటేనే కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోతోందని మండిపడ్డారు.”ప్రతిపక్షాలు, లౌకిక శక్తులు ఇండియా పేరుతో ఏకమయ్యాయి. అది వారికి ఇబ్బందిగా ఉంది. అందుకే వాళ్లు భారత్ అంటున్నారు. ప్రతిపక్షాలు ఇండియా అని అంటుంటే బీజేపీ వణికిపోతోంది” అని సీతారాం ఏచూరి అన్నారు. ఇండియా పేరును మార్చడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.