బీజేపీ.. సెంటిమెంట్‌ రాజకీయం

BJP.. politics of sentiment– ఎన్నికల వేళ తెరపైకి రామమందిరం
–  మోడీని గద్దె దించడమే ఇండియా కూటమి లక్ష్యం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తోందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో సీపీఐ(ఎం) సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే అయోధ్యలోని రామ మందిరాన్ని ముందుకు తెచ్చి.. దేశవ్యాప్తంగా క్యాంపియన్‌ చేస్తూ ప్రజలను భక్తి సెంటిమెంట్‌తో మోసం చేయాలని చూస్తోందన్నారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం లాంటి విధానాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఇండియా కూటమి లక్ష్యమని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, మోడీకి ఓటు వేస్తేనే గ్యాస్‌, పెట్రోల్‌పై సబ్సిడీ ఇస్తామని చెప్పడం మోసపూరితమన్నారు. సంక్షేమాన్ని రాజకీయంగా వాడుకుని లబ్దిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్‌, బడా బాబులకు అప్పజెప్పి లూటీ చేస్తున్నారని వివరించారు. మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అహంకారం వల్లే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిందని, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌ అయకట్టుకు, ఏఎంఆర్పీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సర్వేలు చేసి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. ప్రజా పాలనలో భాగంగా గ్రామాలకు వస్తున్న అధికారులకు అన్ని పథకాలపై అర్హులతో దరఖాస్తులు పెట్టించాలని కోరారు. ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కొయ్య లింగారెడ్డికి సమావేశంలో సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి ఐలయ్య, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మహమ్మద్‌ హశం, సిహెచ్‌. లకిëనారాయణ, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ తదితరులు పాల్గొన్నారు.