బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం

– నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– ఆమనగల్లులో హాత్‌ సే హాత్‌ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-మిర్యాలగూడ
1978 సంవత్సరంలో జనతా సర్కార్‌.. ఇందిరాగాంధీని పార్లమెంట్‌ నుంచి బహిష్కరించి.. నామరూపాలు లేకుండా పోయిందని, ఇప్పుడు రాహుల్‌గాంధీపై పార్లమెంట్‌లో అనర్హత వేటు వేసిన బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో ఆదివారం మిర్యాలగూడ మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ బీఎల్‌ఆర్‌ చేపట్టిన జోడో యాత్రను ఎంపీ ప్రారంభించారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని కులాల, మతాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశం అభివృద్ధి చెందాలని, విద్వేషాలు విడనాడి.. సద్భావంతో ఉండాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు జోడో పాదయాత్ర చేశారని చెప్పారు. ఆ యాత్రకు కొనసాగింపుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామగ్రామాన ఇంటింటికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వివరించాలనే సంకల్పంతోనే నియోజకవర్గాల్లో జోడోయాత్రలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ సంపదను అదానీకి అప్పనంగా అప్పగించిన అవినీతిని పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకే రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. గుడి సాక్షిగా చెబుతున్నా.. 2024లో రాహుల్‌గాంధీ దేశ ప్రధాని అవుతారని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి జోడోయాత్ర ప్రారంభోత్సవానికి ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్‌ఆర్‌, ఎంపీపీ సునీత కృష్ణయ్య, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, రామలింగయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్‌, పొదిల శ్రీనివాస్‌, చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.