ఆప్‌ గొంతు అణచివేసేందుకు బీజేపీ యత్నం

– సామాన్యుల తిరుగుబాటు తప్పదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఆప్‌ గొంతు అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ విమర్శించారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై సీబీఐవి తప్పుడు కేసులని ఆయన ఖండించారు. శనివారం హైదరాబాద్‌ లోని ఆప్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ అధికారిక నివాసం పునరుద్ధరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ సీబీఐని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఆ పునరుద్ధరణ చేసింది పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అయితే కేజ్రీవాల్‌కు ఏమి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆప్‌ నిజాయితీ పాలనను అంతమొందించే ప్రతీకార చర్యలను మానుకోవాలనీ, తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీపై సామాన్యులు తిరగబడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్‌, ఏం.ఏ. మజీద్‌, అధికార ప్రతినిధులు పరీక్షణ్‌ రాజ్‌, ప్రవీణ్‌ యాదవ్‌, ఆప్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, దివ్యంగుల విభాగం అధ్యక్షులు దర్శనం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.