– ఇండియా కూటమి విజయానికి
– కృషి చేయాలి… పార్టీని బలోపేతం చేయాలి
– మహారాష్ట్రలో జరిగిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) నేతల పిలుపు
ముంబయి : బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి విజయానికి కృషి చేయాలని సీపీఐ(ఎం) నేతలు పిలుపునిచ్చారు. వర్లీ ఆదివాసీ తిరుగుబాటు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాల్లో మంగళవారం భారీ ర్యాలీ, బహిరంగసభ జరిగింది. వర్లీ ఆదివాసీ తిరుగుబాటు, తరువాత జరిగిన పోరాటాల ఘనమైన వారసత్వాన్ని ఈ సందర్బంగా వక్తలు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, గిరిజన వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మత నియంతృత్వ స్వభావం, రాష్ట్రంలో బీజేపీ నేతత్వంలోని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అటవీ సంరక్షణ చట్టం (ఎఫ్‌సీఏ), అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) అమలులో నిర్లక్ష్యం, షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల పొడిగింపు చట్టం (పెసా)ను నీరుగార్చడంలో ఆదివాసీ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల సవరణలతో కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందని విమర్శించారు. న్యూస్‌క్లిక్, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దారుణమైన దాడి, ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిల అరెస్టులను ఖండించారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), ఇండియా కూటమి విజయానికి కృషిచేయాలని, పార్టీని అన్ని బహుజన ఫ్రంట్‌లను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 1945 అక్టోబర్ 10న వర్లీ ఆదివాసీ తిరుగుబాటులో ఐదుగురు అమరవీరులను బ్రిటిష్ పాలకులు కాల్చిచంపారు. అలాగే 1996 అక్టోబర్ 10న ప్రజా నాయకుడు గోదావరి పరులేకర్‌ను పాల్ఘర్ జిల్లాలోని తలసరి వద్ద దహనం చేసిన రోజు. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని పాల్ఘర్, థానే జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాల నుంచి 30,000 మందికి పైగా ప్రజలు ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత రద్దీగా ఉండే ముంబయి-అహ్మదాబాద్- జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిని పాల్ఘర్ జిల్లా దహను మండలం.. చరోటి వద్ద గంటపాటు దిగ్బందించారు. సీపీఐ(ఎం), ఏఐకేఎస్, సీఐటీయు, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఏఆర్‌ఏం థానే, పాల్ఘర్ జిల్లా కమిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే వినోద్ నికోల్ అధ్యక్షత వహించగా, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి ఉదరు నార్కర్, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి కిరణ్ గహలా, రాష్ట్ర కమిటీ సభ్యులు రడ్కా కలంగ్డా, లక్ష్మణ్ డోంబ్రే, చందు ధంగ్డా, భరత్ వలంబ, లహానీ దౌదా, ప్రాచీ హతివ్లేకర్ ప్రసంగించారు.