నవ తెలంగాణ- నవీపేట్: బీజేపీ టికెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అబ్బ సొత్తు కాదని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. నవిపేట్, ఎడపల్లి మరియు రెంజల్ మండలాల బూత్ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బిజెపి టికెట్ మోహన్ రెడ్డికి మేమే ఇప్పించామని ప్రగల్బాలు పలుకుతున్నారని బీజేపీ టికెట్ వారి అబ్బ సొత్తు కాదని అన్నారు. 2001లో జెడ్పిటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటిగా పోటీ చేసిన తాను ఒక్కడినే కార్యకర్తల సహకారంతో రెండు పార్టీలను మట్టికరిపించి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్టు 2 న పార్టీలో చేరి 15 నెలల్లో తనను బీజేపీ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో పట్లా పార్టీకి, కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు. 11 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా మెడపాటి ప్రకాష్ రెడ్డి తాను రామ్ లక్ష్మణుల లాగా పని చేశామని గుర్తు చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లు బీసీలను అనగతొక్కుతున్నాయని అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో 52 శాతం బీసీలు కమలం గుర్తుకు ఓటేస్తే 100 సీట్లు గెలుస్తుందని అన్నారు. అదేవిధంగా కొత్త పార్లమెంట్ భవనంలో నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఘనత బిజెపికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఐదున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. బోధన్ ప్రజలు లక్ష్యం లేని గుడ్డి నాయకులను ఎన్నుకోవద్దని అన్నారు. సుదర్శన్ రెడ్డి ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడుసార్లు గెలిచిన బోధన్ ప్రజలకు చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా చేస్తున్న షకీల్ 75 శాతం ఉన్న వర్గాలకు 25 శాతం నిధులు కేటాయిస్తూ 25 శాతం ఉన్న వర్గానికి 75 శాతం నిధులు కేటాయించి అన్యాయం చేస్తున్నాడని అన్నారు. కాబట్టి తనకు ఒకసారి అవకాశం ఇస్తే 50 సంవత్సరాల వరకు చరిత్ర ఉండేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, అడ్లూరి శ్రీనివాస్, సరీన్, గోపికృష్ణ, ఇంద్రకరణ్, ఎంపీపీ రజనీకిషోర్, జెడ్పిటిసి విజయ సంతోష్, బందెల ఆనంద్, రామకృష్ణ, పిల్లి శ్రీకాంత్, వంశీ మోహన్, పుట్ట శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాము, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.