బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ హాస్యాస్పదం

– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్వేష రాజకీయాలకు చోటు లేదు
– బీజేపీ ఇస్తానన్న ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..?
– బండి సంజయ్.. ఖమ్మంలో మతోన్మాదుల ఆటలుసాగవ్‌..!
– సెంటర్‌ సెల్‌, ఖమ్మం నియోజకవర్గం
– సమావేశంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉద్యోగాల పేరిట యువతీ యువకులను మోసం చేసిన బీజేపీ ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్‌ హాస్యాస్పదంగా ఉందని సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ అయిన 40 లక్షల ఖాళీలను కూడా భర్తీ చేయని అసమర్ధ పాలన బీజేపీది అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్వేష రాజకీయాలకు చోటు లేదని తెలిపారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం జరిగిన సీపీఐ(ఎం) సెంటర్‌ సెల్‌, ఖమ్మం నియోజకవర్గ సమావేశంలో నున్నా మాట్లాడారు. నిరుద్యోగ మార్చ్‌లో నిరుద్యోగులు లేరని ఉన్నదల్లా బీజేపీ రాజకీయ నిరుద్యోగులే అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులందరినీ నిలువునా మోసం చేసిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్వేష, విభజన రాజకీయాలకు చోటు లేదన్నారు. బండి సంజయ్… ఖమ్మంలో మతోన్మాదుల ఆటలు సాగవన్నారు. ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీకి ఖమ్మం జిల్లాలో స్థానం లేదన్నారు. అధికారం కోసం బీజేపీ అన్ని రకాలుగా దిగజారిపోయిందన్నారు. ఎవరైనా నాయకులు ప్రలోభాలకు తలొగ్గి బీజేపీలోకి వచ్చినా వారిని ఆదరించే పరిస్థితి లేదన్నారు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతికత బండి సంజరు కి లేదన్నారు. నైజాం నవాబును, రజాకార్ల ఆగడాలను ఎదుర్కొన్న చరిత్ర జిల్లాకు ఉందన్నారు. కాషాయ మూకల ఆటలు ఖమ్మం జిల్లాలో సాగవని తెలిపారు. శవాలపై పేలాలు వేరుకునే బీజేపీకి జిల్లాలో స్థానం ఉండదు అన్నారు. ఖమ్మంలో పట్టుమని 10 ఓట్లు లేని బీజేపీ.. అధికారం కోసం లేని కలలు కంటుదన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, వై.విక్రమ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ఎం.సుబ్బారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.