చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీని తిప్పికొట్టాలి

– తెలంగాణ సాయుధ పోరాట వారుసులు కమ్యూనిస్టులే.. : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-రాజపేట
వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, దున్నేవారికే భూమి కోసం సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన ఘన చరిత్ర కమునిస్టులది.. దీనికి మతరంగు వేయడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంటలోని చింతలపూరి రాంరెడ్డి విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చింతలపూరి రాంరెడ్డి పాత్ర గొప్పదని చెప్పారు. సాయుధ పోరాటంలో రామిరెడ్డిని ఎదిరించలేక రజాకార్లు దొంగచాటుగా హత్య చేశారన్నారు. హిందూ భూస్వాములు, ముస్లిం రజాకార్లు ఒక్కటై పేద రైతుల్ని చిత్రహింసలు పెట్టారని.. ఆ సమయంలో కులమతాలకతీతంగా ప్రజలను సాయుధులుగా తీర్చిదిద్ది కమ్యూనిస్టులు జరిపిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని వివరించారు. ఆనాటి పోరాట ఘటనలకు, బీజేపీ మతం రంగు వేయాలని చూస్తోందని, కుటిల యత్నాలను మానుకుని ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరాడుతుందని చెప్పారు. ముందుగా చింతల పూరి రాంరెడ్డి విగ్రహం వద్దకు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాంరెడ్డి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌, సింగిల్‌విండో చైర్మెన్‌ భాస్కర్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ చింతలపూరి వెంకటరామిరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజ్‌గౌడ్‌, సభ్యులు బబ్బూరి పోశెట్టి, మండల కార్యదర్శి బబ్బురి శ్రీనివాస్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి హీర్లపల్లి ముత్యాలు, రాష్ట్ర కమిటీ సభ్యులు రవి, కొండ భిక్షపతి, శివ తదితరులు పాల్గొన్నారు.