– రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-చింతకాని
దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న బిజెపిని గద్దె దించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నాగులవంచ వంకాయలపాటి రామయ్య ఫంక్షన్‌హాల్ నందు తోటకూరి వెంకట నర్సయ్య అధ్యక్షతన జరిగిన పాతర్లపాడు జోన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని పోతినేని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతను విస్మరిస్తుందని, సంవత్సరానికి కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతకు ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. సీపీఐ(ఎం) అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో నిరుద్యోగం గణనీయంగా తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పంట నష్ట పరిహారం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలు తక్షణమే గోడౌన్‌లకు తరలించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సామినేని రామారావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, దేశబోయిన ఉపేందర్, కాటబత్తిని వీరబాబు, పంగా గోపయ్య తదితరులు పాల్గొన్నారు.