బీజేపీ,బీఆర్‌ఎస్‌ ఒక్కటే

Vijaya Shnahti – కేసీఆర్‌ అవినీతికి కేంద్రం వత్తాసు
– అందుకే కమలానికి గుడ్‌బై
– టీపీసీసీ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ విజయశాంతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ అవినీతిపరుడు ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పిన బీజేపీ…ఆ తర్వాత పట్టించుకోలేదని టీపీసీసీ ప్రచార ప్లానింగ్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ విజయశాంతి విమర్శించారు. ఇప్పడేమో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటై పోయాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అవినీతి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దెదించాలనే నా లక్ష్యం నెరవేరకపోవడంతో నేను కమలానికి గుడ్‌ బై చెప్పినట్టు వివరించారు. శుక్రవారం కాంగ్రెస్‌లోని చేరిన ఆమె… శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీజేపీ పెద్ద తప్పు చేయడంతోనే తాను కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. అవినీతిపరుడైన కేసీఆర్‌ను జైల్లో వేస్తామంటూ ఆనాడు బీజేపీ మాట ఇచ్చిందనీ, అందుకు నేను కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు.నెలలు, సంవత్సరాలు గడిచిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్రంలో బీజేపీకి మెజార్టీ ఉన్నప్పటికీ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా మౌనంగా ఉన్నట్టు తెలిపారు. ‘సంజరు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన్ను మారిస్తే బీజేపీకి ప్రమాదం అవుతుంది’ అని చెప్పినప్పటికీ మార్చారని గుర్తు చేశారు. ఇప్పటి బీజేపీ నేతలకు విలువలు లేవని విమర్శించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ విజయశాంతి కాంగ్రెస్‌లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆమె చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.