– ఏఐసీసీ అధికార ప్రతినిధి కన్నయ్యకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని తొమ్మిదేండ్ల బీజేపీ పాలన అబద్ధాలకు, దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి కన్నయ్యకుమార్ విమర్శించారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో బీజేపీ పాలనపై రూపొందించిన ‘నౌ సాల్, నౌ సవాల్’ అనే పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కన్నయ్యకుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారనీ, వాటినే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోడీ ప్రభుత్వం అనడమే సరైందని విమర్శించారు. వంద రోజుల్లో నల్లధనం బయటకు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనీ, అధికారంలోకి వస్తే 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోసం చేసిందని విమర్శించారు. తొమ్మిదేండ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది ప్రశ్నలు లేవనెత్తుతున్నదని చెప్పారు. ఆ ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలను దేశ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారని చెప్పారు. తప్పులు చేసిన వాళ్ళంతా బీజేపీ వాషింగ్ మెషిన్‌లోకి వచ్చి పవిత్రంగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. అదానీ అభివృద్ధియే దేశాభివృద్ధిగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులు అభివృద్ధి అవుతుంటే అమిత్‌షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాక పేదల సంఖ్య పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. తొమ్మిదేండ్లలో మోడీ ఒక్క ప్రెస్‌మీట్ కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రధాని కేవలం ప్రధాని మాత్రమే కాదనీ, ఆయనే రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి ఇలా మోడీకి ఏం కావాలనిపిస్తే అది అయిపోతారని ఎద్దేవా చేశారు. ‘ధరలు పెరుగుతున్నాయంటే ధరలు తగ్గించడం ప్రధాని పని కాదని బీజేపీ నేతలు చెప్పడం దారుణమన్నారు. బీజేపీ నాయకులు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు కానీ మిత్ర రాజకీయాలకు వ్యతిరేకం’ అని ఎందుకు చెప్పడం లేదన్నారు. పుల్వామా ఘటనకు ముందే హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని కుల గణనను ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటున్న మోడీ ‘మన పార్లమెంట్ మన ప్రైడ్’ అనలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్ ఫండ్ పీఎం కోసమే ఏర్పాటు చేశారనీ, అందుకే వివరాలు బయటకు చెప్పడం లేదని విమర్శించారు. కరోనా వాక్సిన్ కోసం ఖర్చు చేసిన నిధులను డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా లాకుంటున్నారని చెప్పారు. ఇన్ని వైఫల్యాలు మూట కట్టుకున్న మోడీ విశ్వగురువు ఎలా అయ్యారని ప్రశ్నించారు.
కుల గణనను చేసేందుకు బీజేపీకి భయమెందుకు? వీహెచ్
బీసీ ప్రధాన మంత్రి అని చెప్పుకునే మోడీ కనీసం కేంద్రం బీసీ శాఖను ఏర్పాటు చేయలేకపోయారని మాజీ ఎంపీ వి హనుమంత రావు ఎద్దేవా చేశారు. కుల గణనను చేసేందుకు బీజేపీకి భయమెందుకని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీలో గొప్ప మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. లారీలో ప్రయాణించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ఉన్న సమస్యపై రాహుల్ గొంతెత్తి మాట్లాడుతున్నారని చెప్పారు. బీసీలకు 40శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, మోడీ జిమ్మికులు : పొన్నాల లక్ష్మయ్య
ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శిం చారు. పార్లమెంట్ వ్యవస్థపై బీజేపీ చిత్తశుద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రజలు తిరగబడితే నల్ల చట్టాల విషయంలో బీజేపీ ఎలా తోక ముడి చిందో, భవిష్యత్‌లోనూ అదే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిం చారు. లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించేందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించడం పట్ల హర్షనీయమన్నారు.