దేశంలో ధరల పెరుగుదలకు బీజేపీ విధానాలే కారణం..

– వామపక్ష కేరళ విధానాలే దేశానికి ఆదర్శం ొ ఆ రాష్ట్రంలో అదుపులో ధరలు:డి.పాపారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో అడ్డూ అదుపు లేకుండా నిత్యావసర వస్తువులు, ఆహార సరకుల ధరలు పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయ కుమార్‌ సమన్వయంలో బుధవారం అడ్డూ అదుపులేని ధరల పెరుగుదల కారణాలు – పర్యవసనాలు అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌ను ఉద్దేశించి పాపారావు మాట్లాడుతూ, ధరలను తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుందని చెప్పడం అబద్ధమని తెలిపారు. కేవలం ఫైనాన్స్‌ పెట్టుబడుల లాభాలను కాపాడేందుకేనని చెప్పారు. అధికంగా జీఎస్టీ విధించడం, బియ్యం, గోధుమలు, పంచదార వంటివి ఇష్టానుసారంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, నిల్వల పరిమితి చట్టాన్ని ఎత్తేయటం, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తప్పుకోవడం, ధాన్యం సేకరణ నుంచి కేంద్రం వైదొలగడం ధరల పెరుగుదలకు కారణమని వివరించారు.
కేరళలో అదుపులో ధరలు…
అన్ని రాష్ట్రాల్లోనూ సాధ్యమే…
వామపక్ష ప్రభుత్వ పాలనలో ఉన్న కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ ధరలు అదుపులో ఉన్నాయని పాపారావు తెలిపారు. దేశంలో ఎనిమిది శాతం వరకు ద్రవ్యోల్బణం ఉన్న సమయంలోనూ కేరళలో ఐదు శాతం ఉంటుందని గుర్తు చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ద్రవ్యోల్బణం ఉంటున్న విషయాన్ని గమనించాలని కోరారు. కేరళ ప్రభుత్వం దాదాపు 20 రకాల ఆహార సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడమే అక్కడ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటానికి కారణమని వివరించారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ధరలను అదుపులోకి తేవొచ్చని తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా పెరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం ద్వారా మార్కెట్‌ను అదుపు చేయొచ్చని వివరించారు. ముఖ్యంగా ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో …..కేరళ మంచి ఉదాహరణ అని పాపారావు సూచించారు.