ఏపీలో రక్తమోడిన రహదారులు

– సంతమాగులూరు, కదిరి అర్బన్‌
అమరావతి: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. సొంత పనుల నిమ్తితం పట్టణానికి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తుండగా కారు ఢ కొనడంతో సత్యసాయి జిల్లా కదిరిలో నలుగురు, తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్ని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆటోను లారీ ఢీకొనడంతో ప్రకాశం జిల్లాలో ఐదుగురు మరణించారు. తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరుకు చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ప్రకాశం జిల్లా మార్కాపురానికి శనివారం రాత్రి వచ్చారు. వేడుకల అనంతరం తిరిగి ఆటోలో గుంటూరుకు పయనమయ్యారు. సంతమాగులూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో గుంటూరు, కర్నూలు రహదారిపైకి వచ్చే సరికి ఆటోను లారీ ఢకొీంది. దీంతో గుంటూరు నల్లచెరువు ఒకటవ లైన్‌కు చెందిన అలివేలు మంగతాయారు (19), తమ్మిశెట్టి తులసి (16), గుంటూరుకు చెందిన పాల్త్యా నారీనాయక్‌ (19) అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన గుంటూరు హౌసింగ్‌ బోర్డు ఆదర్శనగర్‌ మూడవ లైనుకు చెందిన చెలిమెళ్ళ కవిత (19), బుర్రి మాధవి (35)లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రహదారిపై ఏర్పడిన గుంత నేపథ్యంలో పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అతివేగంగా వచ్చిన లారీ డ్రైవర్‌ హెచ్చరిక బోర్డును తప్పించబోయి రాంగ్‌ రూట్‌లో ఆటో వైపు దూసుకెళ్లాడు. దీంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి జిల్లా కదిరి మండలం బుక్కపట్నం పరిధిలోని మదిరే బైలుతండా గ్రామానికి చెందిన కొంతమంది సొంతపనుల నిమిత్తం కదిరి వచ్చారు. తిరిగి ఆటోలో వెళ్తున్న క్రమంలో కదిరి మండలం ఎర్రదొడ్డి సమీపాన కారు ఢకొీంది. ఈ ప్రమాదంలో చిన్నస్వామి నాయక్‌(45) చలపతి నాయక్‌ (46) ఆటో డ్రైవర్‌ భాస్కర్‌ నాయక్‌ (40) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీలేఖ (35)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని డిఎస్‌పి శ్రీలత, సిఐలు సూర్యనారాయణ, తమ్మిశెట్టి మధు పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.