– బీఆర్ఎస్ను వీడిన ముగ్గురు నాయకులు
– ఆందోళనలో అధికార పార్టీ నాయకులు
గతంలో ఎప్పుడు లేని విధంగా కల్వకుర్తి నియోజకవర్గం లో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు పార్టీ వీడి పోతుండడంతో అధికార పార్టీ నాయకులు కలవర పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మరోసారి పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పలువురు ముఖ్య నాయకులు జైపాల్ యాదవ్ టికెట్ విషయంలో పునరాలోచించాలని దాదాపు నెల రోజులపాటు పార్టీ అధిష్టానానికి గడువు ఇచ్చినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
నవతెలంగాణ -కల్వకుర్తిటౌన్
కల్వకుర్తి నియోజవర్గంలో బలమైన నాయకునిగా పేరుపొందిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సైతం అధికార పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినప్పటికీ అధి ష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ తీవ్ర మన స్థాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆది వారం ప్రకటించారు. ఇలా ఒకరి వెంట ఒకరు ముఖ్య నాయకులు పార్టీ వీడుతుండడంతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న పలువురు ముఖ్య నాయకులలో సైతం తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొని ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయోనన్న ఆందోళన కిందిస్థాయి కార్యకర్తలలో నెలకొంది. ఇటీవల కడ్తాల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎదుటి ఇద్దరు ముఖ్య నాయకులు ఘర్షణకు దిగి ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ పరి ణామాలతో పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
– రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి
జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ తో పాటు, పలువురు ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం వారం రోజుల తర్వాత కల్వకుర్తి పట్టణంలో దాదాపు 50 వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ పథకాల ఆశ చూపి మభ్యపెట్టె ప్రయత్నం
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ అభివద్ధి గురించి గానీ పార్టీ కార్యకర్తల గురించి గానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల ను ఆశ చూపి మరోసారి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దళిత బంధు పథకంలో పలువురు దళిత యువతను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది యువకులు దళిత బంధు పథకం కోసం ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జైపాల్యాదవ్తో అంటి ముట్టనట్లు ఉన్న పలువురు నాయకులకు సైతం ఏదో ఒకటి చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు వారు ఎన్నికలలో మనస్పూర్తిగా పనిచేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ టికెట్టు కసిరెడ్డి నారాయణరెడ్డి కే
అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్టు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు సర్వేలలో నారాయణరెడ్డి ముందు వరుసలో ఉండడంతో ఆయనకు టికెట్టు ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. మరి కొంతమంది అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.