హైదరాబాద్ : పిఎస్‌బిల్లో అత్యంత మెరుగైన ప్రగతి కనబర్చిన వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) టాప్‌లో నిలిచింది. ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆ బ్యాంక్ లాభాలు 126 శాతం పెరిగి రూ.2,602 కోట్లుగా నమోదయ్యాయి. 12 పిఎస్‌బిల సంయుక్త లాభాలు 57 శాతం పెరిగి రూ.1,04,649 కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2022-23లో పిఎస్‌బిల ఆర్థిక ఫలితాల గణంకాల ప్రకారం.. రుణాల జారీలోనూ బిఒఎం 29.4 శాతం వృద్థితో రూ.1,75,120 కోట్లకు చేరాయి.
ఆ తర్వాత స్థానాల్లో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్‌లు 21.2 శాతం, 20.6 శాతం చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ ఎస్‌బిఐ రుణాల వితరణలో 16 రెట్లు పెరిగి రూ.27,76,802 కోట్ల విలువను కలిగి ఉంది. డిపాజిట్ల పరంగా బిఒఎం 15.7 శాతం వృద్థితో రూ.2,34,083 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్లలో 13 శాతం పెరిగి రూ.10,47,375 కోట్లుగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 11.26 శాతం వృద్థితో రూ.12,51,708 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్నాయి. బిఒఎం మొత్తం వ్యాపారం 21.2 శాతం పెరిగి రూ.4,09,202 కోట్లకు చేరింది. బిఒబి 14.3 శాతం పెరిగి రూ.18,42,935 కోట్లుగా నమోదయ్యింది.