బుక్కయిన భట్టి

Booked Bhatti– నిండు సభలో నిలదీసిన మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్కను మంత్రి కే తారకరామారావు నిలదీశారు. మీకెలాంటి విశ్వసనీయత లేదంటూ ఎద్దేవా చేశారు. శనివారం ‘రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె, పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వ చర్యలు-సాధించిన ఫలితాలు’ అంశంపై లఘుచర్చ జరిగింది. దీనిపై మల్లు భట్టివిక్రమార్క మాట్లాడారు. గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ కొన్ని పేర్లు చదివి వినిపించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నాయనీ, నిధులు ఇవ్వకపోవడం కాదంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ వివరణ ఇచ్చారు.
తప్పుడు ఆరోపణలు చేసినందుకు భట్టి క్షమాపణలు చెప్పాలంటూ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పలు పత్రికల్లో సర్పంచుల ఆత్మహత్యల వార్తలు వచ్చాయనీ, అవి తప్పు అయితే తాను తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానని భట్టి చెప్పారు. అనంతరం పట్టణ ప్రగతిపై మాట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోదే అనీ, తాగునీళ్లు కూడా సరిగా ఇవ్వట్లేదని విమర్శించారు. తన ఇంటికి రోజూ ట్యాంకర్‌ ద్వారా నీళ్లు తెప్పించుకుంటున్నానని అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఈ చర్చకు సమాధానం చెప్పే క్రమంలో భట్టి ఇంటి వివరాలు, నీటి కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌ సహా అన్నింటినీ సభలో చదివి వినిపించారు. ఆయన కిరాయి ఇంట్లో ఉంటున్నారనీ, 2022 జనవరి నుంచి నల్లా మీటర్‌ చెడిపోయిందంటూ కట్టిన బిల్లుల వివరాలు వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భట్టి తన ఇంటికి ఒక్క ట్యాంకర్‌ కూడా బుక్‌ చేసుకోలేదని తేల్చిచెప్పారు. శాసనసభలో ఇలాంటి అబద్ధాలు చెప్పడం సరికాదనీ, అందుకే కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు.
చిల్లర రాతలకు భయపడం
మీడియా పేరుతో బ్లాక్‌మెయిలర్లు, చిల్లర రాతగాళ్లకు తాము భయపడబోమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయనీ, వాటి రాజకీయ ప్రయోజనాలు అందరికీ తెలుసు అని చెప్పారు. అలాంటి పత్రికల్లో వచ్చిన వార్తలు పట్టుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావించడం ఏంటని భట్టిని నిలదీశారు.
రేవంత్‌పై ఫైర్‌
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కే తారకరామారావు అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పార్టీ గురించి మాట్లాడుతూ ఆపార్టీ ఇప్పటి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 2014 జనవరి 25న అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని ఉటంకించారు. దీనికి తాను స్పీకర్‌ అనుమతి తీసుకున్నాననీ, అవసరమైతే చెక్‌ చేసుకోవచ్చని కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి చెప్పారు. అసెంబ్లీ రికార్డుల నుంచే తాను రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్ని తీసుకున్నాననీ అన్నారు. ఆనాడు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ … తన తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవనీ, శ్మశానంలో నెత్తిన నీళ్లు చల్లుకొని, ఇంటికొచ్చి స్నానం చేద్దామంటే కరెంటు లేదనీ, దీనికి కారణం కాంగ్రెస్‌పార్టీనే’ అని చెప్పారని ఉటంకించారు. అలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎలా పెట్టుకున్నారో…ఏమో అని వ్యగ్యంగా అన్నారు.
ఓట్ల కోసం మాట్లాడొద్దు
కండ్లముందు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే, కేవలం లేని అసంతృప్తిని ప్రజల్లో సృష్టించేందుకు పాదయాత్రలు చేస్తూ, కాంగ్రెస్‌ నేతలు నానా అవస్థలు పడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని అభివృద్ధి పనుల ఫోటోలను ప్రదర్శించారు.
మమ్మల్ని ఓడించండి
అసెంబ్లీలో తాను చెప్పే అభివృద్ధి అబద్ధమైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర, సంక్షేమ, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతున్నదనీ, అది ప్రజల ఆస్తి అని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ 2004లో తెలంగాణ ఇస్తామని నానబెట్టి వెయ్యిమంది ప్రాణాలు తీసుకున్నదనీ, అప్పుడే వారి విశ్వసనీయత పోయిందన్నారు. కర్నాటకలో గెలిస్తే, ఇక్కడా ఏదో జరగుతుందని పగటికలలు కంటున్నారని అన్నారు.