ఇద్దరూ ఇద్దరే

Both are twoకంచిపేటలో రామనాథం, శివయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ నిజాయితీలో ఒకరిని మించి ఒకరు అని ఊళ్లో అందరూ అనుకునేవారు. ఒకసారి రామనాథం వద్ద శివయ్య కొంత పొలం కొనుగోలు చేశాడు. చాలా ఏళ్లుగా నిరుపయోగంగా పడున్న ఆ పొలంలోని పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలూ అన్నీ తీసివేయించి వ్యవసాయానికి అనువుగా మలిచాడు. సాగుకు అనువుగా మారిన ఆ పొలాన్ని ఒకరోజు శివయ్య దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డొచ్చి ముందుకు కదలలేదు. అక్కడ కాస్త తవ్వి చూడగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా లంకె బిందెలు బయటపడ్డాయి.
కళ్లు చెదిరే ధనరాశులతో నిండి ఉన్న ఆ బిందెలు అలాగే పట్టుకుని రామనాథం ఇంటికి వెళ్లాడు శివయ్య. ఆ సంపదని రామనాథం చేతికిస్తూ, ”నీ దగ్గర కొన్న ొలంలో ఈ ధనరాశి దొరికింది. బహుశా నీ పూర్వీకులకు చెంది ఉంటుంది. కాబట్టి నీవే తీసుకో రామనాథం!” అన్నాడు. కానీ నిజాయితీలో శివయ్యకి ఎంత మాత్రమూ తీసిపోని రామనాథం కూడా, ”అది మా పూర్వీకులకు చెందినది అయినా ఇప్పుడు ఆ పొలం నీకు అమ్మేశాను కాబట్టి పొలంతో బాటు దాంట్లో దొరికిన ధనరాశీ నీకే చెందుతుంది. అలా బిందెలపై నీకే హక్కుంది కాబట్టి ఈ ధనరాశి నువ్వే ఉంచుకో శివయ్యా!” అని తీసుకోడానికి నిరాకరించాడు రామనాథం.
”నేను పొలం మాత్రమే నీ దగ్గర కొన్నాను. అందులో ఎప్పటిదో నీ పూర్వీకుల సొత్తు ఉంటే అది న్యాయంగా నీకే చెందాలి రామనాథం” అంటూ శివయ్య కూడా తన పట్టు వీడలేదు.
ఇద్దర్లో ఎవ్వరూ ఒక్క మెట్టూ దిగిరాకపోవడంతో పోనుపోనూ ఆ సంపద ఎవరికి చెందాలన్నది సమస్యగా మారి చివరికి గ్రామాధికారి వరకూ వెళ్లింది. ఎక్కడైనా సంపద దక్కించికోడానికి కొట్లాడేవాళ్లని చూశాం గానీ ఇలా సంపద నీదంటే నీదని వద్దనుకునే వాళ్లని ఇక్కడే చూస్తున్నాం అంటూ తలపట్టుకున్నాడు గ్రామాధికారి. ఇద్దరి నిజాయితీని గూర్చి బాగా ఎరిగిన గ్రామాధికారికి ఇదో సవాలుగా మారింది.
చివరికి అతనికో ఉపాయం తట్టింది. కంచిపేటలోనే ఉన్న అనాథ శరణాలయాన్ని, బడినీ చాలారోజులుగా నిధుల సమస్య పట్టి పీడిస్తున్నది. కాబట్టి ఆ ధనరాశిని శివయ్య ద్వారా రామనాథం పేరిట వితరణ చేయించాడు. దీనివల్ల శివయ్య తనది కాని సంపదని రామనాథానికి ఇచ్చినట్టు భావించాడు. రామనాథం పేరిట చేసిన వితరణ కాబట్టి ఆ పుణ్యం కాస్తా రామనాథానికి చేరుతుంది అనుకున్నాడు శివయ్య. రామనాథం కూడా శివయ్య సంపదని అనాథాశ్రమానికీ, బడికీ విరాళంగా ఇచ్చినట్టు భావించాడు.
ఒక గొప్ప మహత్కార్యానికి ఆ ధనరాశి ఉపయోగపడేలా చేసినందుకు గ్రామాధికారిని శివయ్య, రామనాథంతో పాటు ఊరివాళ్లంతా మెచ్చుకున్నారు.

– మల్లారెడ్డి మురళీ మోహన్‌, 8861184899