స్కూల్‌ బస్సు ఢికొని బాలుడు మృతి

Boy killed after being hit by a school bus–  స్కూల్‌ యాజమాన్యం, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమంటూ..
– గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌ మెట్‌/ హయత్‌నగర్‌
ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌ నిర్లక్షానికి ఓ అభం శుభం తెలియని బాలుడు బలయ్యాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ కుంట్లూర్‌లో గురువారం జరిగింది. హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్డఅంబర్‌పేట మున్సిపాలిటీ కుంట్లూర్‌లోని గణేష్‌ నగర్‌ కాలనీలో తన్నీరు శ్రీకాంత్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. శ్రీకాంత్‌ వృత్తి రీత్యా పోస్టుమ్యాన్‌. వారి కూతురు నిషిత పెద్ద అంబర్‌ పేటలో క్యాండోర్‌ ష్రైన్‌ హై స్కూల్‌లో చదువుకుంటుండగా, కొడుకు పవన్‌ హర్ష కుమార్‌(3) ఇంటి వద్ద ఉంటున్నాడు. రోజూలాగే స్కూలు బస్సు (టీఎస్‌ 07యు ఎన్‌ 0098) గురువారం ఇంటి వద్దకు రాగా నిషిత ఎక్కింది. అయితే వ్యాన్‌ డ్రైవర్‌ ఈశ్వర్‌ నిర్లక్ష్యం కారణంగా అక్కడే తండ్రి పక్కనే వ్యాన్‌కు ఆనుకుని ఉన్న పవన్‌ హర్షకుమార్‌ తలపైకి వ్యాన్‌ ఎక్కింది. దాంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ క్లీనర్‌ మల్లా రెడ్డి సైతం బాలుడిని గమనించకపోవడం గమనార్హం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
విషయం తెలసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. స్కూల్‌ యాజమాన్యం, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు పాఠశాలలు విద్యాశాఖను తన గుప్పిట్లో ఉంచుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్ధి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రయివేటు పాఠశాలలను కట్టడి చేయకుంటే భవిష్యత్‌ మరింత అంధకారంగా మారుతుందన్నారు. ఆందోళన చేస్తున్న ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వారిని పంపించేశారు.