ఆర్‌ఎంపీ వైద్యానికి బాలుడు బలి

Boy victim of RMP treatmentనవతెలంగాణ – నాంపల్లి
ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ చేసిన తెలిసి తెలియని వైద్యానికి ఓ బాలుని నిండు ప్రాణం బలయిన ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఆదివారం జరిగింది. మృతిచెందిన బాలుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం జాన్‌ తండా గ్రామపంచాయతీకి చెందిన సపావట్‌ రత్యా- సాలి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు జశ్వంత్‌(13) నాంపల్లి ఆదర్శ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. కాగా, జశ్వంత్‌కు జలుబు, దగ్గు ఉండటంతో రత్యా తండ్రి భీమ్లా జశ్వంత్‌ని వెంటబెట్టుకుని ఆదివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న శ్రీనివాస ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌కి తీసుకెళ్లాడు. దాంతో అక్కడ పనిచేస్తున్న డాక్టర్‌(ఆర్‌ఎంపీ) జశ్వంత్‌కు ఏదో ఇంజక్షన్‌ చేతి నరానికి ఇవ్వగా, బాలుడు క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో డాక్టర్‌ భయపడి.. బాబుకు సీరియస్‌గా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అతనే.. కారు పిలిపించి చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌ బాబును పరిశీలించి మృతి చెందాడని చెప్పడంతో.. వెంటనే ఆర్‌ఎంపీ పరారయ్యాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీనివాస ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ ముందు ఉంచి పెద్ద బంధువులతో కలిసి బస్టాండ్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ను వెంటనే అరెస్టు చేసి చనిపోయిన బాలుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. మృతుని తండ్రి రత్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కె.లచ్చిరెడ్డి వెల్లడించారు.