పేదింటి ఆడబిడ్డకు ‘కంకణాల’ చేయూత

నవతెలంగాణ-గంగాధర : పెండ్లి నిశ్చమైన ఓ పేదింటి ఆడబిడ్డకు ఆ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామానికి చెందిన బొమ్మరవేణి శృతికి వివాహం నిశ్చయం అయ్యింది. అయితే పేద కుటుంబానికి చెందిన శృతి తండ్రి రవి ఏడేళ్ల క్రితమే మరణించాడు. తల్లి విజయ ఉన్నా వ్యవసాయ కూలిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోగా, దయనీయంగా మారిన తమ పరిస్థితిని స్థానిక సర్పంచ్ విజేందర్ రెడ్డికి వివరించారు. వెంటనే స్పందించిన విజేందర్ రెడ్డి శృతి వివాహానికి అవసరమైన పుస్తె, మెట్టెల నిమిత్తం 19 వేల రూపాయలను ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఈ నెలలోనే వివాహం నిశ్చయం కావడంతో నగదును ఆడబిడ్డ తల్లి విజయకు సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.