– వేదికను మార్చే ఆలోచనలో దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్ : రాబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాలని దక్షిణాఫ్రికా చైనాను కోరవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడైన పుతిన్ పైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంటును దక్షణాఫ్రికా పట్టించుకోకుండా ఉండాలంటే ఇలా చేయటమే ఉత్తమమని ఆ దేశ ప్రభుత్వాధికారులు భావిస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల చొరవతో ఏర్పాటైన బ్రిక్స్ దేశాల సమావేశం ఆగస్టు 22వ తేదీడు జరగనుంది. గత జనవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
అయితే మార్చినెలలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పిల్లలను బలవంతంగా వేరు చేశారనే యుద్ధ నేర ఆరోపణ మీద అరెస్టు వారెంటును జారీ చేసింది. అయితే ఉక్రెయిన్ పిరంగి దాడుల నుంచి రక్షించటానికే తాము ప్రజలను ఆ ప్రాంతం నుంచి తరలించామని రష్యా పేర్కొంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును రష్యా గుర్తించనప్పుడు అది జారీచేసిన అరెస్టు వారెంటుకు అర్థమే లేదు. అయితే దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చార్టర్ పైన సంతకం చేసినందువల్ల పుతిన్ ను అరెస్టు చేయటం అక్కడి ప్రభుత్వ కర్తవ్యం అవుతుంది.