– లక్ష్యానికి దూరంగా పీఎంయూవై
– అడ్డంకులు, అపోహలతో దూరమవుతున్న ప్రజలు
– పడిపోతున్న గ్యాస్ సగటు వినియోగం
– ఇప్పటికీ కొన్ని చోట్ల వంట చెరకే ఆధారం
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల ప్రజలకు వంటగదిలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఇంధనాన్ని అందించే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. వంట చెరకు వినియోగం వాయు కాలుష్యానికి కారణమవుతోందని, మహిళల ఆరోగ్యం దెబ్బతింటోందని భావించిన కేంద్ర ప్రభుత్వం వారి ఇబ్బందులను తొలగించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. కట్టెలు, బొగ్గు, పిడకలతో వంట చేస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్న గృహిణులు ఈ పథకంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంలో ఈ పథకం వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు.
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు పీఎంయూవై పథకంపై క్రమేపీ ఆసక్తిని కోల్పోతున్నారు. గ్యాస్ కనెక్షన్లు పొందేందుకు భగీరథ ప్రయత్నం చేయాల్సి రావడం, ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడం, అన్నింటికీ మించి ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తెలిపింది. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ), అసర్ సోషల్ ఇంపాక్ట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌ఏఆర్) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించి, ఈ నెల 21న ప్రచురించాయి. రాజధాని ఢిల్లీలోని పట్టణ మురికివాడలలోనూ, జార్ఖండ్ రాష్ట్రంలోని ఐదు గ్రామాలలోనూ అధ్యయనం జరిపారు. మహిళలతో ముచ్చటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. చర్చా గోష్టులు సైతం నిర్వహించారు. మహిళలు తమకు తేలికగా లభించే ఇంధనాన్నే వంటకు ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు వంట గ్యాస్ లభించే ప్రాంతాలలో మహిళలు దాని వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు ఎక్కువగా దొరుకుతుంది. దీంతో అక్కడి గృహిణులు దానితోనే వంటలు చేస్తున్నారు. అయితే వారికి దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు అర్థం కావడం లేదు. వంట చెరకు కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, తమ ఆరోగ్యం దెబ్బతింటుందని వారు గ్రహించలేకపోతున్నారు. వంట చెరకును కాలిస్తే వచ్చే పొగ అసౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నారే తప్ప అది కాలుష్య కారకమని తెలుసుకోవడం లేదు.
తగ్గుతున్న వినియోగం
పీఎంయూవై పథకం కింద జూలై 1వ తేదీ నాటికి 9.59 కోట్ల మంది లబ్ది పొందుతున్నారని ఇటీవల ముగిసిన రాజ్యసభ సమావేశాలలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు. గ్యాస్ కనెక్షన్‌కు అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, డీజీసీసీ బుక్‌లెట్, ఇన్‌స్టలేషన్ ఛార్జీలు…వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే రూ.1,600 చెల్లిస్తోందని వివరించారు. సిలిండర్ బరువును బట్టి వినియోగదారులు తమకు ఇష్టమైన దానిని ఎంచుకోవచ్చునని, 14.2 కిలోల బరువుండే ప్రతి సిలిండర్‌కు ప్రభుత్వం రూ.200 సబ్సిడీగా అందిస్తోందని, సంవత్సరానికి 12 సిలిండర్ల వరకూ సబ్సిడీ పొందవచ్చునని చెప్పారు. అయితే ధరలు పెరిగిపోవడం, అది కూడా సిలిండర్ ధరను ఒకేసారి చెల్లించాల్సి రావడంతో అల్పాదాయ వర్గాల వారు వీటిపై ఆసక్తి చూపడం లేదని అధ్యయనం తెలిపింది. 2019, 2020లో సగటును ఒక్కో కుటుంబం సంవత్సరానికి మూడు సిలిండర్లను మాత్రమే వినియోగించిం దని, 2021లో వినియోగం 4.4 సిలిండర్లకు పెరిగినా 2022లో 3.7 సిలిండర్లకు తగ్గిపోయిం దని ఓ వార్త పత్రిక నివేదిక చెబుతోంది. లబ్దిదారుల ఆదాయం పెరగకపోవడమే దీనికి కారణం. అయితే చిన్న చిన్న కుటుంబాలకు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు సరిపోతాయని కూడా ఆ నివేదిక తెలిపింది. 2021-22లో 92 లక్షల మంది వినియోగదారు లు ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేదని సాక్షాత్తూ మంత్రివర్యులే చెప్పారు. ధరల పెరుగుదలే దీనికి కారణమని ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.
ఇబ్బందులతో సతమతం
పీఎంయూవై పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో చిరునామాకు సంబంధించిన ధృవపత్రాలు పొందడం చాలా కష్టం. గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలంటే నివాస దృవపత్రం తప్పనిసరి. దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో కూడా విపరీతమైన జాప్యం జరుగుతోంది. మారుమూల ప్రాంతాలలోని నివాస గృహాలకు గ్యాస్ సరఫరా చేయకపోవడం మరో ఇబ్బందిగా మారింది. పైగా గ్యాస్ వినియోగంపై గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అపోహలు తొలగిపోలేదు. ఎల్‌పీజీ గ్యాస్‌ను వినియోగించి వంట చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని, ఆహార పదార్థాలు రుచిగా ఉండవని, ఉపయోగానికి అది సురక్షితం కాదని మహిళలు విశ్వసిస్తున్నారు.
ఏం చేయాలి?
గ్రామీణ మహిళలలో వంట గ్యాస్ వినియోగంపై నెలకొన్న అపోహలు తొలగించా ల్సిన అవసరం ఉన్నదని అధ్యయనం సూచించిం ది. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటింటికీ నేరుగా వంట గ్యాస్‌ను అందజేస్తే ప్రయోజనక రంగా ఉంటుందని, దరఖాస్తు చేసే సమయంలో సమర్పించాల్సిన పత్రాల ప్రక్రియను సులభతరం చేయాలని సిఫార్సు చేసింది.