బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులు నిజమే

– రైజ్లర్లపై అనైతిక చర్యలకు ఏ అవకాశాన్నీ వదల్లేదు
– అన్నింటికీ ఆధారాలున్నాయి:ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కోర్టుకు తెలిపారు. ఆయనపై అభియోగా లకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌ పై ఢిల్లీలోని రోజ్‌ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. తజకిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిందితుడు ఫిర్యాదుదారు (మహిళా రెజ్లర్‌)ని గదిలోకి పిలిచి బలవంతంగా కౌగిలించుకున్నాడని చెప్పారు. నిరసన వ్యక్తం చేయగా.. తండ్రిలా చేశానని అన్నాడన్నారు. నిందితుడికి తన చర్యలపై పూర్తి అవగాహన ఉందని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్‌ తరఫు న్యాయవాది వాదనను అతుల్‌ ఖండించారు. నేరాలన్నీ దేశం బయట జరిగితేనే సీఆర్‌పీసీ సెక్షన్‌ 188 ప్రకారం అనుమతి అవసరమని అతుల్‌ పేర్కొన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ విషయంలో ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, దీంతో అనుమతి అవసరం లేదని అతుల్‌ తెలిపారు. బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు మోపేందుకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్‌ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. సరిపోతాయని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో విడివిడిగా అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయయని, కోర్టు వాటన్నింటినీ ఒకేచోట విచారించిందని గుర్తుచేశారు.
బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా రెజర్లు నెలల తరబడి ఢిల్లీలో ఆందోళన చేసినా పట్టించుకోకపోగా, వేధించారు. సుప్రీం కోర్టు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించడం, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో… ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం గమనార్హం.