బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి

రెజ్లర్ల సంఘం చీఫ్‌ను అరెస్టు చేయాలి :
వ్యవసాయ కార్మిక సంఘాల నేతల డిమాండ్‌
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే తొలగించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మికసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన 22 రోజులు పూర్తి చేసుకుంది. ధర్నా శిబిరాన్ని ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు ఆందోళన చేస్తున్న క్రీడాకారులకు ఉద్యమ సహాయ నిధిని అందజేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బి. వెంకట్‌, రాజ్యసభ ఎంపీ శివ దాసన్‌, బోలా ప్రసాద్‌, బిజిలాల్‌ భారతి, రాధిక మీనన్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బి.వెంకట్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ అండతోనే బ్రిజ్‌ భూషణ్‌ పెట్రేగి పోతున్నారని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రధాని మోడీ నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. రెజ్లర్లు చేస్తున్న పోరాటం దేశ ప్రతిష్టకు, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన పోరాటమని అన్నారు. దేశానికి గోల్డ్‌ మెడల్‌ తీసుకొచ్చిన రెజ్లర్లను రోడ్డున పడేసిన బ్రిజ్‌ భూషణ్‌ ను తక్షణమే పదవి నుంచి తొలగించి ..సత్వరమే అరెస్టు చేయాలని డిమాండ్‌
చేశారు. క్రీడాకారులు లైంగిక వేధింపులకు గురి కావడం అంతర్జాతీయ సమాజం దృష్టిలో దేశ ప్రతిష్ట దిగజార్చిందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాల నేతలతో పాటు అఖిల భారత రూరల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారని అన్నారు. క్రీడాకారులకు సంఘీభావంగా ఈనెల 18న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని తెలిపారు.

అధికార బీజేపీ మహిళ ఎంపీలు మద్దతు ఇవ్వలేదు..
వారికి లేఖలు పంపుతాం : వినేష్‌ ఫోగట్‌