అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం

– రామజన్మభూమి వెనుక భాగంలోని వార్డులో గెలుపు
– మూడో స్థానంలో బీజేపీ
లక్నో : యూపీలోని నగరపాలక ఎన్నికల్లో ఒక ముస్లిం అభ్యర్థి విజయం ఆశ్చర్యం కలిగిస్తున్నది. హిందూత్వ ప్రాబల్యం అధికంగా ఉండే అయోధ్య లోని ఒక వార్డులో సదరు అభ్యర్థి గెలిచారు. ఇండిపెండెంట్‌గానే పోటీ చేసి ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. అయోధ్యలో జరిగిన మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 వార్డుల్లో 27 వార్డులను ఆ పార్టీ కైవసం చేసుకున్నది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 17 స్థానాల్లో విజయం సాధించగా.. స్వతంత్రులు 10 స్థానాల్లో గెలిచారు.
ఈ ఎన్నికల్లో సుల్తాన్‌ అన్సారీ అనే స్థానిక యువకుడు తన ఎన్నికల అరంగేట్రంలోనే గణనీయమైన విజయాన్ని సాధించాడు. రామ్‌ అభిరామ్‌ దాస్‌ వార్డులో గెలిచాడు. ”అయోధ్యలో హిందూ-ముస్లిం సోదరభావం, రెండు వర్గాల శాంతియుత సహజీవనానికి ఇది ఉత్తమ ఉదాహరణ. మా హిందూ సోదరుల నుంచి ఎలాంటి పక్షపాతం లేదు. వారు నన్ను వేరే మతానికి చెందిన వ్యక్తిగా భావించలేదు. వారు నా విజయానికి మద్దతు, భరోసాను ఇచ్చారు” అని అన్సారీ చెప్పాడు.
రామజన్మభూమి వెనుక భాగంలో ఉన్న ఈ వార్డులో ముస్లిం ఓట్ల శాతం 11 శాతం మాత్రమే ఉన్నది. మొత్తం ముస్లిం ఓట్లు 440 కాగా.. హిందూ ఓట్లు 3,844 గా ఉన్నాయి. మొత్తం 2,388 ఓట్లు పోలవగా అన్సారీకి 42 శాతం ఓట్లు లభించాయి. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అన్సారీకి 996 ఓట్లు వచ్చాయి. అన్సారీ.. మరో స్వతంత్ర అభ్యర్థి నాగేంద్ర మాంఝీపై 442 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ” రామ మందిరానికి అయోధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ మతపరమైన పట్టణం హిందువులకు ఎంత పవిత్రమైనదో ముస్లింలకు కూడా అంతే పవిత్రమైనది. ఇక్కడ చాలా మసీదులు కనిపిస్తాయి. అనేక శతాబ్దాల నాటి ముస్లిం సూఫీల సమాధులు కూడా ఉన్నాయి” అని అయోధ్యకు చెందిన వ్యాపారవేత్త సౌరబ్‌సింగ్‌ అన్నారు. అయోధ్యలో ముస్లింలు ఉండగలరు, ఎన్నికల్లోనూ గెలవగలరని వార్డుకు చెందిన అనూప్‌ కుమార్‌ తెలిపారు.

Spread the love