– కౌంటర్ వెయిట్ రోప్
– వృథా అవుతున్న నీరు
నవతెలంగాణ-కడెం
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తే సమయంలో 15వ నెంబర్ వరద గేటు కౌంటర్ వెయిట్ రోప్ పుల్లి వద్ద తెగిపోయింది. అది ప్రాజెక్టు కింది వైపు నీళ్లలో పడిపోయింది. దీంతో కడెం ప్రాజెక్టు 15వ నెంబర్ వరద గేట్ ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతు పనులు పూర్తికాకముందే ప్రాజెక్టు 15వ నెంబర్ వరద గేటు కౌంటర్ వేయిట్ విరిగిపోయింది. ఇప్పటికే ప్రాజెక్టు రెండో నెంబర్ వరద గేటు కౌంటర్ వెయిట్ గత వరదలకు విరిగిపోవడంతో నేటికీ మరమ్మతులు పూర్తికాక గేటు ఎత్తలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు 15వ నెంబర్ వరద గేటు కౌంటర్ వెయిట్ రోప్ వైర్ తెగి విరిగిపోవడంతో దీనికి మరమ్మతులు ఎన్నాళ్లకు పూర్తవుతాయోనని స్థానికుల్లో చర్చ నడుస్తోంది. ప్రాజెక్టు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక నాయకులు, రైతులు, కడెం ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.