బీఆర్‌ఎస్‌ డైలమా

BRS Dilemma– ‘ఇండియా’నూ కావాలందామా.. ‘భారత్‌’కే జై కొడదామా?
– ఎటూ తేల్చుకోలేని బీఆర్‌ఎస్‌
– నేటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి…’ అన్నట్టుగా ఉంది అధికార బీఆర్‌ఎస్‌ పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసిన దరిమిలా… కక్కలేక మింగలేక కుడితిలో పడ్డ మోడీ సర్కార్‌ ‘భారత్‌’ అనే కొంగొత్త ఎజెండాను ముందుకు తెచ్చింది. మన దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్‌గా మారుస్తామంటూ జీ-20 సమావేశాల సందర్భంగా చెప్పకనే చెప్పింది. ఇది రేపు పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ తమ వైఖరులను స్పష్టం చేశాయి. కేంద్ర వైఖరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయకపోవటం గమనార్హం. ఇటీవల మారిన రాజకీయ పరిణామాల రీత్యా కమలానికి గులాబీ దగ్గరవుతోంది. మేం తటస్థం అని ఎంత చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌… ఇండియాకు కాకుండా భారత్‌కే జై కొడతారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. అయితే ఇక్కడ కారు పార్టీకి ఒక సమస్య ఎదురవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్‌ఎస్‌ భారత్‌కు జై కొడితే… బీజేపీకి అది మరింత సాగిలబడిందనే సంకేతాలు వెలువడతాయి. అలాగాకుండా ఇండియా పేరే కొనసాగాలని కోరితే కమలం పార్టీతో కారు పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కేవలం బీజేపీ, బీఆర్‌ఎస్‌కు మధ్య ఎలాంటి  బంధమూ లేదని చెప్పేందుకే ఈ నోటీసులు ఇచ్చారనే చర్చ కూడా కొనసాగుతున్నది. అందువల్ల ఈ తతంగం ‘నామ్‌ కే వాస్తే’గా ఉండాలన్నా, మున్ముందు మోడీ సర్కార్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా కచ్చితంగా బీఆర్‌ఎస్‌… భారత్‌కే జై కొట్టాల్సి ఉంటుందనే వాదనలు కూడా వినబడుతున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టత వస్తుందా..? లేదా..? అన్నది చూడాలి.
జమిలితో అయోమయం
జమిలీ ఎన్నికలొస్తాయనే వార్తలు, ఊహాగానాలతో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం మూణ్నెల్ల ముందే తొందరపడి తొలి జాబితాను ప్రకటిం చటంతో బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అసమ్మతి అదుపులోకి రాకపోగా.. మరోవైపు ఎన్నికల దాకా క్యాడర్‌ను, లీడర్లను ‘జాగ్రత్తగా చూసుకోవాల్సి రావటం’ తమకు తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు కేంద్రం పచ్చజెండా ఊపితే… శాసనసభ ఎన్నికలు మరో రెండు మూడు నెలలు వాయిదా పడటం ఖాయం. అదే జరిగితే తొలి జాబితాలోని అభ్యర్థులకు ఐదారు నెలలపాటు ‘పైసల’ పాట్లు తప్పవు. ఇది తలుచుకుంటేనే భయంగా ఉందని బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ‘షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే ఓకే. అలాగాకుండా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం గెలుపు మాకు తలకు మించిన భారమవుతుంది. మేం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది మా పార్టీకి ఇబ్బందికర పరిణామమే…’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.