హామీల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం


• అధికారంలోకి రాగానే గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం
• పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి 
• కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు 
నవతెలంగాణ -పెద్దవంగర: 
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి ధ్వజమెత్తారు. మండల పరిధిలోని పోచంపల్లి, టీక్యా తండాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కుటుంబాలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వంపై, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రజలకు నమ్మకం పోయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా నాడు సోనియాగాంధీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఇస్తే కలిసి నడుస్తామని చెప్పిన కేసీఆర్‌ తరువాత మాట మార్చారని ఆరోపించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలంతా కేసీఆర్‌, ఎర్రబెల్లి లను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఇతర పథకాల నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని అన్నారు. అవినీతిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ. 2,500, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం అన్నదాతలకు, కౌలు రైతులకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12వేలు, వరి పంటకు రూ.500 బోనస్‌, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని పేదలకు స్థలంతోపాటు రూ.5లక్షలు, ఉద్యమకారులకు రూ. 250 చదరపు గజాల స్థలం, యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, చేయూత పథకం ద్వారా నెలకు రూ. 4వేల పెన్షన్‌, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్య బీమాను అందజేస్తామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడమే సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీల ఆకాంక్ష అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా కల్పించారు. పేరు, కీర్తిని సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, పాలకుర్తి ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్  అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇన్చార్జి  విజయ్ పాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, పట్టణ యూత్ అధ్యక్షుడు అనపురం వినోద్, నాయకులు పన్నీరు వేణు, పాండు, సత్తి రెడ్డి, బాలాజీ, సతీష్, జంపా తదితరులు పాల్గొన్నారు.